ఘోర రైలు ప్రమాదం(Train Accident)లో 25 మంది మృతిచెందిన ఘటన పాకిస్తాన్(Pakisthan)లో చోటుచేసుకుంది. సర్హరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హజారా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో ఈ దారుణం సంభవించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రమాదంలో 25 మంది ప్రాణాలు విడువగా మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని రైల్వే శాఖ వెల్లడించింది.
కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న ఈ రైలులో పదికి పైగా బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. పాకిస్తాన్ రైల్వేస్ సుక్కుర్ డివిజినల్ కమర్షియల్ ఆఫీసర్ మొహ్సిన్ సియాల్ ప్రమాదానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. అయితే ప్రాణ నష్టం గురించి ఆయన తెలియజేయలేదు. సర్హరి రైల్వే స్టేషన్ ఔటర్ సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని, ఆ ప్రాంతానికి తాను వెళ్తున్నట్లు తెలిపారు.
మరోవైపు ప్రమాద స్థలంలోని దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒరిగిపోయిన రైలు బోగీల నుంచి చాలా మంది గాయాలతో బయటకు వస్తున్నారు. మరికొందర్ని సహాయకులు తరలిస్తున్నారు. ప్రమాద స్థలానికి పోలీసులు, రైల్వే సిబ్బంది, అధికారు భారీ ఎత్తున చేరుకున్నారు. మృతిచెందిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు.