తిరుమల(Tirumala)లో వన్యమృగాల సంచారం ఎక్కువవడంతో టీటీడీ (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. హైలెవల్ మీటింగ్ నిర్వహించి భక్తుల భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. మెట్లమార్గం, ఘాట్ రోడ్లలో అనేక చర్యలు తీసుకుంది. భక్తుల రక్షణే తమకు ముఖ్యమని, అందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తెలిపారు. అలిపిరిలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలను అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.
మధ్యాహ్నం 2 గంటల తర్వాత పిల్లలకు నడకమార్గంలో అనుమతి లేదన్నారు. పెద్దలకు రాత్రి 10 గంటల వరకే నడకదారిలో అనుమతి ఉందన్నారు. ఘాట్ రోడ్డు (Ghaat Road)లో సాయంత్రం 6 గంటల వరకే టూవీలర్లను అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల భద్రతకు ఫారెస్ట్ సిబ్బందిని సెక్యూరిటీగా నియమిస్తున్నట్లు తెలిపారు. నడక మార్గంలో సాధు జంతువులు తినడానికి భక్తులు ఏవీ ఇవ్వకూడదని, అలా ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
నడకమార్గంలో దుకాణదారులు వ్యర్థ పదార్థాలను బయట పారవేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. భక్తుల కోసం డ్రోన్ల (Drones)ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలిపిరి (Alipiri), గాలిగోపురం, 7వ మైలురాయి వద్ద హెచ్చరిక బోర్డులు (Warning Boards) ఏర్పాటు చేశామని, కాలినడకన వెళ్లే ప్రతి ఒక్కరికీ కర్రను ఇస్తున్నామన్నారు.
తిరుపతి-తిరుమల (Tirupati-Tirumala) మధ్యలో 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. భక్తులను గుంపులుగానే నడకమార్గంలోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు. నడక దారిలో బేస్ క్యాంపు, మెడికల్ క్యాంపులతో పాటుగా ఫోకస్ లైట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి అటవీశాఖ నుంచి అనుమతి రావాల్సి ఉందని భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) తెలిపారు.