జీవో నెంబర్ 1 పైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్పులపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. రోడ్ల పైన సభలు, సమావేశాల నియంత్రణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1పై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఈ జీవోను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని తెలిపింది. దీనిపై రాష్ట్ర హైకోర్టు సీజే ధర్మాసనం విచారణ చేపడుతుందని వెల్లడించింది. వాద, ప్రతివాదులు ఇరువురు డివిజన్ బెంచ్ ఎదుట అన్ని అంశాలు ప్రస్తావించుకోచ్చునని సూచించింది. అన్ని ఆప్షన్స్ ఓపెన్‌గా ఉంచుతున్నట్లు తెలిపింది. కేసు మెరిట్స్ పైన ఇప్పుడు ఎలాంటి విచారణ చేపట్టడం లేదని సీజేఐ తెలిపింది.
నోటీసు ఇవ్వకుండా, ఉదయం ప్రస్తావిస్తే, మధ్యాహ్నం విచారణ చేపట్టి స్టే ఇవ్వడంపై అభ్యంతరాలు ఉన్నాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై అభ్యంతరం తెలిపిన ప్రతివాదులు, రాష్ట్ర అడ్వోకేజ్ జనరల్ వాదనల అనంతరమే డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇరువురి వాదనల అనంతరం ప్రస్తుతం సీజీఐ కూడా జోక్యం చేసుకోమని తెలిపింది. ఈ నెల 23న హైకోర్టు విచారణ చేపడుతుందని తెలిపింది.