YS Sharmila Contest from Kadapa : తమ చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్ వైసీపీ టికెట్ ఇవ్వడాన్ని తాను తట్టుకోలేకనే కడప ఎంపీగా బరిలోకి దిగుతున్నానని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున కడప నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపుల పాయలో తండ్రి సమాధిని ఆమె దర్శించుకున్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, కుమార్తె అంజలి రెడ్డితో కలిసి తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించారు.
తండ్రి సమాధి దగ్గర తొలుత ప్రత్యేక ప్రార్థనలు జరిపిన షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను అక్కడుంచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. చిన్నాన్నను హత్య చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకుని వస్తున్నారని ఆరోపించారు. ఆ హత్య చేయించిన వాళ్లకే జగన్ కడప ఎంపీ(KADAPA MP) టికెట్ ఇచ్చారని ఆరోపించారు. వివేకా హంతకులను జగన్ కాపాడుతున్నారని విమర్శించారు. అవినాష్‌కు జగన్ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోతున్నాని తెలిపారు. చిన్నాన్న దారుణంగా హత్యకు గురైతే గుండె పోటుతో మరణించారని మొదట సాక్షి టీవీలో చూపించిన విషయాన్ని గుర్తు చేశారు.
తమ చిన్నాన్నను హత్య చేసిన హంతకులు సాక్ష్యాధారాలు ఉన్నా నేటికీ తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు జగన్(JAGAN) ‘నువ్వు నా చెల్లివి కాదు. నా బిడ్డవి’ అన్నారన్నారు. అలాంటికి ఎన్నికలు అయి ముఖ్యమంత్రి కాగానే పూర్తిగా మారిపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం జగన్‌తో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పారు. అలాగని ఆయనంటే తనకు ఎలాంటి ద్వేషమూ లేదన్నారు.