వైసీపీ సర్కార్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. అంగళ్లు కేసులో తాము కలగజేసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ సర్కార్ పెట్టిన 6 పిటీషన్లను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
అంగళ్లు కేసులో తెలుగుదేశం పార్టీ నేతలకు సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై తాము జోక్యం చేసుకోమని సుప్రీం తేల్చి చెప్పింది. అంగళ్లు ఘటనలో తెలుగుదేశం నేతలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణ అనంతరం హైకోర్టు తెలుగుదేశం నేతలకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 6 వేర్వేరు పటీషన్లను ఏపీ సర్కార్ దాఖలు చేసింది.
ఈ కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఏపీ సర్కార్ కోరింది. ఈ కేసును విచారించిన జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది సుప్రీం ధర్మాసనం ఏపీ సర్కార్ పిటీషన్లపై పలు అనుమానాలను వ్యక్తం చేసింది. ఘటన జరిగిన 4 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై అభ్యంతరం తెలిపింది.
భద్రత కల్పించే పోలీసులే సాక్షులుగా ఎఫ్ఐఆర్ ఏంటని ప్రశ్నించడంతో ఏపీ తరపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అంగళ్లు ఘటనలో పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. దీంతో పోలీసులే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, పోలీసులే సాక్షులుగా ఉండటం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది.
హైకోర్టు బెయిల్ ఇవ్వడం పట్ల తాము జోక్యం చేసుకోడానికి ఏమీ లేదంటూ సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో ఏపీ సర్కార్‌కు షాక్ తగిలినట్లయ్యింది.