NDL: విజయవాడలో అక్టోబర్ 27 నుంచి 30వ తేదీ వరకు ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని నంద్యాల జిల్లా అధ్యక్షుడు సూర్య ప్రతాప్ ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. విద్యారంగంలో వస్తున్న మార్పులు, సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ మహాసభలకు అందరూ తరలి రావాలని కోరారు.
GNTR: తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరగడాన్ని హిందూ ధార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా గుంటూరులో ఆదివారం ప్రదర్శన చేపట్టారు. వెంకటేశ్వరస్వామి విగ్రహంతో పూజలు జరిపి నిరసన వ్యక్తం చేశారు. లడ్డూ తయారీ కోసం కల్తీ నెయ్యిని అందించిన సంస్థలపై చర్యలు తీసుకోవాలని స్వామీజీలు ధ్వజమెత్తారు.
KKD: అక్రమ డీజిల్ వ్యాపారాలకు చెక్ పెట్టేందుకు విజిలెన్స్ ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం ఉప్పలంక గ్రామం సమీపంలో ఆదివారం యానం నుంచి ఆక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్‌ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ట్యాంకర్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కృష్ణా జిల్లా: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గూడూరు మండల స్థాయి ఆటల పోటీలు ఈ నెల 24, 25 తేదీలలో జరగనున్నాయి. ఈ మేరకు అండర్-14,17 విభాగాలలో గూడూరు జడ్పీ పాఠశాలలో అథ్లెటిక్స్, గేమ్స్ పోటీలు నిర్వహిస్తామని పాఠశాల హెచ్ఎం డి.పుష్పలత తెలిపారు. 24న బాలురకు, 25న బాలికలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామని, ఆసక్తి కలిగిన క్రీడాకారులు గూడూరు జడ్పీ పాఠశాలలో సంప్రదించాలన్నారు.
కృష్ణా జిల్లా: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాగాయలంక మండల స్థాయి ఆటల పోటీలు ఈ నెల 23, 24 తేదీలలో జరగనున్నాయి. ఈ మేరకు అండర్-14,17 విభాగాలలో నాగాయలంక జడ్పీ పాఠశాలలో అథ్లెటిక్స్, గేమ్స్ పోటీలు నిర్వహిస్తామని మండల స్పోర్ట్స్ కన్వీనర్ కె.పూర్ణచంద్రరావు తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు జడ్పీ పాఠశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు.
గుంటూరు: నంబూరులో గల దశవతార వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు.11 రోజుల పాటు పవన్ కల్యాణ్ దీక్ష చేయనున్నారు. దీక్ష తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. గత పాలకుల వికృత పోకడలతో లడ్డూ అపవిత్రమైందన్నారు.
GNTR: కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసే వరకూ తమ పోరాటం ఆగదని జీజీహెచ్ కాంట్రాక్టు నర్సులు స్పష్టం చేస్తున్నారు. ఆసుపత్రి ఆవరణలో వారు చేపట్టిన నిరసన కార్యక్రమం ఆదివారంతో 17వ రోజుకు చేరింది. ఆదివారం అయినప్పటికీ పట్టువదలకుండా నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యల పరిష్కారం కోసం నర్సింగ్ ఉద్యోగులు తమ గళం విప్పారు.
తూ.గో: దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం ఇంకా వరద నీటిలోనే ఉందని, భక్తులెవరూ దర్శనాలకు రావద్దని దేవస్థాన ఈవో లక్ష్మీ కుమార్ తెలిపారు. ఆదివారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గోదావరి వరద ఉద్ధృతంగా ఉందని, అమ్మవారి ఆలయం చుట్టూ వరద నీరు ఉందని తెలిపారు. ఆలయంలోకి వెళ్లడానికి మార్గం లేదని పేర్కొన్నారు.
కృష్ణా జిల్లా: ఈనెల 16వ తేదీన మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్బంగా పెడనలో గొడవకు సంబంధించి ముస్లిం మత పెద్దలు షాదీ ఖానాలో వివరణ ఇచ్చారు. పండగ సందర్బంగా తోరణాలు కట్టుకునే తరుణంలో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. అయితే ఇప్పటివరకు పెడనలో అందరం సహోదర భావంతో జీవించామని అన్నారు. ఎటువంటి వివాదాలకు పాల్పడిన వారిని పోలీసులకు అప్పచెప్తామన్నారు.
నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నందున విజయవాడ మీదుగా గుంటూరు (GNT)- విశాఖపట్నం (VSKP) మధ్య ప్రయాణించే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను 2 రోజులపాటు దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. GNT-VSKP మధ్య ప్రయాణించే రైలు(17239)ను ఈ నెల 29,30 తేదీల్లో.. VSKP-GNT రైలు(12740)ను ఈ నెల 30, అక్టోబర్ 1వ తేదీన రద్దు చేశామని రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
NLR: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో భర్తీ కాని సీట్లలో ప్రవేశాలకు నాలుగో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్ కె. శ్రీధర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 26 వ తేదీలోపు దరఖాస్తును రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.
కృష్ణా జిల్లా: నందిగామలో మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవికి కొందరు పేర్లు పార్టీ అధిష్ఠానం ముందు ఉంచినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అయితే అందరికంటే ముందు వరుసలో మాజీ జడ్పీటీసీ వాసిరెడ్డి ప్రసాద్ పేరు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల నాయకులు చెబుతున్నారు. దీంతో ఆ పార్టీ సీనియర్ నాయకుల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కృష్ణా జిల్లా: వీరులపాడు మండలంం కొనతాలపల్లి గ్రామంలో నిర్వాహకుల ఆధ్వర్యంలో వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు డిప్యూటీ సీఎం పవన్, హీరో ఎన్టీఆర్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫొటోలను ప్రదర్శించారు. అనంతరం డీజెలు, డాన్సులతో పురవీధుల్లో గణనాథుడిని ఊరేగించి నిమజ్జనం చేశారు.
కృష్ణా జిల్లా: అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్య దర్శి కనపర్తి శ్రీనివాసరావుని పార్టీ అధిష్ఠానం నియమించింది. చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారు. గతంలో పార్టీకి ఇంఛార్జ్ బాధ్యతలు వహించిన బుద్ధప్రసాద్ జనసేనలో చేరి ఎమ్మెల్యే కావటంతో టీడీపీ ఇంఛార్జ్‌ను ప్రకటించలేదు.
కృష్ణా జిల్లా: ఇటీవల కృష్ణా వరదలు, అధిక వర్షాల కారణంగా ముంపుకు గురైన పంట పొలాలు నేడు సాగునీరు అందక నెరలిస్తున్నాయి. మోపిదేవి మండలంలోని పెద్దకళ్లేపల్లి పంచాయతీ పరిధిలో సాగునీరు అందక వరి పంటలు నెరలిచ్చాయి. 11/1 నుంచి 11/4 బ్రాంచ్ కాలువల ద్వారా భూములకు సాగునీరు అందాల్సి ఉంది. ఈ కాలంలో నుంచి నీరు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు.