ATP: నార్పల మండలం చామలూరులో ఆదివారం జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ పాల్గొని, సీసీ రోడ్లు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. త్వరలోనే నియోజకవర్గ యువత కోసం జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు భరోసా కల్పించిందన్నారు.
మన్యం: జీవో నంబర్ 85ను రద్దు చేయాలని పీహెచ్సీ వైద్యుల సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్ వినోద్ అన్నారు. ఆదివారం పార్వతీపురం పట్టణంలో వైద్యులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వైద్యులు పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటాను కుదిస్తూ జారీ చేసిన జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించే వైద్యులకు అలవెన్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
శ్రీకాకుళం: UTF భవన్ లో ఆదివారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ పరీక్ష సన్నాహక సమావేశం నిర్వహించినట్లు J.V.V జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ 25న పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు జిల్లాలో 30 మండలాల నుంచి సుమారు 25 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారని అన్నారు.
ASR: మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో చింతూరు ఆదివాసీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం చింతూరు మండల కేంద్రంలో మావోయిస్టుల వ్యతిరేక ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా మావోయిస్టులు అభివృద్ధికి అడ్డంకులుగా మారుతున్నారని నినాదాలు చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు.
NDL: ఆళ్లగడ్డలోని అవోపా కార్యాలయంలో ఆదివారం అవోపా మహిళా విభాగ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్, థైరాయిడ్, బీపీ వ్యాధుల మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆళ్లగడ్డకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం, డాక్టర్ సాయి ప్రణీష, మాక్లోడిస్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు హాజరై రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను కూడా అందజేశారు.
ASR: అరకులోయ మండలంలోని శరభగుడ కాలనీ పరిసర ప్రాంతంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పలు వీధుల్లో గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కుక్కల వలన రోజువారి పనులకు వెళ్లే కాలనీవాసులు ఒంటరిగా వెళ్లేందుకు భయపడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.
NDL: అసాంఘిక కార్య క్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని రౌడీషీటర్లను ఉద్దేశించి ఆళ్లగడ్డ తాలూకా డీఎస్పీ రవికుమార్ పేర్కొన్నారు. ఆదివారం సిరివెళ్ల మండల పోలీస్టేషన్ ఆవరణలో సీఐ వంశీధర్, ఎస్సై చిన్న పేరయ్య ఆధ్వర్యంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో ప్రతిమనిషి గౌరవప్రదంగా జీవించాలని చెప్పారు.
NDL: నందికొట్కూరు మండలం మల్యాల గ్రామంలోని ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును సందర్శించుటకు వచ్చిన రాష్ట్ర జన వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుని నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం ఎత్తిపోతల వద్ద పుష్పగుచ్చం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
E.G: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైవర్షన్ రాజకీయాలు చేయడంలో దిట్ట అని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం రాజమండ్రిలో తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెల్లుబోయిన మాట్లాడారు. వైసీపీపై అసత్య ప్రచారాలను వారి పత్రికల ద్వారా ఎల్లప్పుడూ ప్రసారం చేయించారని ఆరోపించారు.
PLD: SC వర్గీకరణ పునఃపరిశీలించాలని ఆదివారం పెదకూరపాడులో జరిగిన మాల మహానాడు కమిటీ సమావేశంలో మాల జాతీయ అధ్యక్షుడు గోళ్ళ అరుణ్ కుమార్ హాజరయ్యారు. అయన మాట్లాడుతూ.. వర్గీకరణపై సుప్రీం తీర్పు కాదని, మోదీ తీర్పు అని అన్నారు. మాల, మాదిగ సోదరుల మధ్య చిచ్చు పెట్టడం తగదన్నారు. దీనిపై కేంద్రం ప్రభుత్వం ఆలోచన ధోరణి మార్చుకోవాలని కోరారు.
WG: కొవ్వూరులో ఆదివారం కూడా 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. గణేశ్ నిమజ్జనం కార్యక్రమంలో జరిగిన గొడవలతో 1వ వార్డులో పోలీసులు ప్రత్యేక పికెట్లను ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా 144వ సెక్షన్ కొనసాగుతూనే ఉంది. పట్టణంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు అన్ని పూర్తయ్యే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని పట్టణ సీఐ విశ్వం తెలిపారు.
NLR: బుచ్చి పట్టణంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా నగర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ రోజు ఆదివారం పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలోని వాటర్ ట్యాంకులను శుభ్రం చేశారు అనంతరం ప్రభుత్వ పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
SKLM: జిల్లాలో సుప్రసిద్ధ దేవాలయంగా పేరొందిన శ్రీ అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానాన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రసాదం విక్రయ కౌంటర్ ను తనిఖీ చేశారు. లడ్డు ప్రసాదం తయారీ, నాణ్యత ప్రమాణాలు తదితర వాటిపై సిబ్బందితో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు.
PLD: వినుకొండలోని పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన భక్త బృందం, అన్నదాన కమిటీ సభ్యులు మాల్యాద్రి ఆధ్వర్యంలో శ్రీశైలంకు పాదయాత్ర ప్రారంభించారు. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వర్షాలు విస్తారంగా కురవాలని శ్రీశైలం,సాగర్ డ్యాంలు నీళ్లతో నిండాలని రైతులకు కాలువల ద్వారా పంటలకు నీళ్లు రావాలని సంకల్పం చేయడం జరిగిందన్నారు.
E.G: ప్రపంచ పర్యాటక దినోత్సవం-2024ను పురస్కరించుకొని పర్యాటక అంశంపై తూ.గో. జిల్లా స్థాయి పోటీలను సెప్టెంబరు27న నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఆదివారం తెలిపారు. 4అంశాలలో ఈ పోటీలను నిర్వహిస్తామని, వకృత్వ, క్విజ్, వీడియో రీల్, ఫొటోగ్రఫీ విభాగాలలో ఆసక్తి ఉన్న యువత పాల్గొని, వారిలోని సృజనాత్మకత ప్రదర్శించేందుకు ఇది చక్కటి అవకాశం అన్నారు.