ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తెలంగాణ నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు పట్టించుకున్నట్లుగా లేదు. ఆయన చేసిన విమర్శలను తెలంగాణ అధికార పార్టీ నేతలు లైట్‌గా తీసుకుంటున్నారు. తెలంగాణలో అధ్యక్షుడి నుండి మొదలు అందరు నేతలు చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ప్రజాకర్షణ కలిగిన వారు. కానీ ఏపీలో బీజేపీకి సరైన నాయకుడు లేడని, కనీసం అధ్యక్షుడిని కూడా పట్టించుకునే పరిస్థితులు లేవంటున్నారు. అయినప్పటికీ సోము వీర్రాజు ఏదో సందర్భంలో తాను ఉన్నానని, తమ పార్టీ ఉందని చెప్పేందుకు ఘాటు వ్యాఖ్యలు, సవాళ్లు విసిరినప్పటికీ, ఏ నేతలు పట్టించుకున్న సందర్భాలు లేవని అంటున్నారు. తాజాగా సోము తెలంగాణ మంత్రి కేటీ రామారావుకు సవాల్ విసిరారు. దానిని పట్టించుకున్న నాథుడే లేడని చెప్పవచ్చు.
కొద్ది రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర విభజన, ఉమ్మడి రాష్ట్రంపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణలోని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. ఇలా అన్ని పార్టీలు సజ్జలపై నిప్పులు చెరిగాయి. చివరకు ఖమ్మంలో టీడీపీ సభలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడూ స్పందించారు. సజ్జలవి అర్థంలేని మాటలని అభిప్రాయపడ్డారు. అంతటి ఘాటు వ్యాఖ్యలు కాకపోయినప్పటికీ, ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ఏ పార్టీ నేత అయినా మరో తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెడితే వ్యతిరేక పక్షాలు గట్టిగా స్పందించిన సందర్భాలు ఎన్నో. కానీ ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడి మాటలను, సవాళ్లను బీఆర్ఎస్ నేతలు పట్టించుకున్నట్లుగా లేదు.
సోము వీర్రాజు మంగళవారం కేటీఆర్‌కు సవాల్ విసిరారు. తెలంగాణ మంత్రి ఎప్పుడు చూసినా కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారని, అబద్దాలు మాట్లాడేందుకు అతనిది నోరా లేక తాటిమట్టనా అని భగ్గుమన్నారు. కేంద్ర నిధులకు సంబంధించి కేటీఆర్ తనతో చర్చకు సిద్ధమా సవాల్ చేశారు. తనతో చర్చకు కూర్చుంటే కేటీఆర్‌ను వాయించి పడేస్తానని, ఆయన అబద్దాలన్ని చిత్తు కాగితాల్లా కాల్చేస్తానన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అభివృద్ధిపై తాను ఎవరితోనైనా చర్చకు సిద్ధమన్నారు. కుటుంబ పార్టీల పాలనలో తెలుగు రాష్ట్రాల్లో అబద్దాలు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. అలాగే, అవినీతిలో ఉన్న కేసీఆర్ కుమార్తె కొద్ది రోజుల్లో ఎక్కడకు వెళ్తుందో చూడాలని వ్యాఖ్యానించడం కొసమెరుపు.
సాధారణంగా ఈ వ్యాఖ్యలు ఇతర పార్టీలు, ఇతర నేతలు చేస్తే బీఆర్ఎస్ లేదా కేటీఆర్ ధీటుగానే స్పందించేవారు. కానీ సోము వీర్రాజు వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. లిక్కర్ కేసులో కవిత పేరు రావడంపై తెలంగాణలో పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సోము కూడా ఆమెను టార్గెట్ చేసినప్పటికీ, స్పందించిన దాఖలాలు లేవు. తెలంగాణలో బీజేపీ అధికార పార్టీతో కయ్యానికి కాలు దువ్వుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పరుగెడుతుంటే, ఏపీ బీజేపీ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ఏపీ బీజేపీలో కదలిక లేకపోవడం కూడా సోము వీర్రాజు సవాల్‌ను పట్టించుకోకపోవడానికి మరో కారణం.