బీఆర్ఎస్( భారత రాష్ట్ర సమితి) ఏపీలోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. పలువురు ఏపీలోని నేతలను తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. వారిలో.. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా ఉన్నారు.
నేటి సాయంత్రం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందని కేసీఆర్ చేస్తున్న కార్యక్రమాలు నన్ను బాగా ఆకర్షించాయని అన్నారు. ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు.
ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాజధాని, సెక్రటేరియట్ నిర్మిస్తామని చెప్పారు. చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదని ఆయన అన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలను బీజేపీ వేధిస్తోందని ప్రజలే బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తాను చివరి శ్వాస వరకూ కేసీఆర్‌తోనే ఉంటానని చెప్పారు. అయితే ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మాత్రం ఏపీలో బీఆర్ఎస్ ప్రభావం ఉండదని, కేసీఆర్ ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అన్నారు. ఇక వైఎస్సార్సీపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని పేర్కొన్న ఆయన అంశాల వారీగా జాతీయ పార్టీలకు మద్దతు ఇస్తామని అన్నారు. ఇక ఇప్పటి దాకా చాలా అంశాల్లో కలిసి నడిచిన వైసీపీ-బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ మధ్య దూరం మొదలైందనే చెప్పాలి.