Andhrapradesh: ఐఏఎస్లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏపీ సర్కార్!
ఏపీలో ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల జీతాలు ఇంకా అందలేదు. దీనిపై పలువురు అధికారులు పెదవి విరుస్తున్నారు. తమ జీతాలు చెల్లించని పక్షంలో కేంద్రానికి నివేదించనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని ఐఏఎస్ (IAS) అధికారులకు ఇప్పటి వరకూ జీతాలు అందలేదు. సెప్టెంబర్ నెల వేతనం ఇప్పటి వరకూ అందలేదని అధికారులంతా మండిపడుతున్నారు. అక్టోబర్ 5వ తేది దాటినా కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో సర్కార్ ఉందని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలల్లో ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం 20వ తేది వచ్చినా కూడా వేతనాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని పలువురు అధికారులు గగ్గోలు పెడుతున్నారు.
కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి వేతనాలు (Salaries) చెల్లించకుండా ఇలా నిలిపివేయడం పట్ల అధికారులు గుర్రు మంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెబుతున్నారు. జీతాలు ఖాతాల్లో జమకాకుంటే కేంద్రానికి (Central Government) ఫిర్యాదు చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఐఏఎస్ అధికారులతో పాటుగా చాలా విభాగాలకు చెందిన ఉద్యోగులకు, టీచర్లకూ సెప్టెంబర్ నెల వేతనాలు ఇంకా అందలేని స్థితి ఉంది. దీనిపై సర్కార్ ఎటువంటి చర్య తీసుకోవడం లేదని, పండగల నేపథ్యంలో ఇలా చేయడం మంచి పరిణామం కాదని పలువురు అధికారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.