తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురువారం అసెంబ్లీకి వెళ్లనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు.
KCR : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గురువారం అసెంబ్లీకి వెళ్లనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్ లో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు. తర్వాత అసెంబ్లీలోని లెజిస్లేచర్ పార్టీ కార్యాలయం చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. తదనంతరం బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సమయంలో ఫామ్ హౌస్లో కాలు జారి పడిపోయి కేసీఆర్ తీవ్రగాయాల పాలయ్యారు. వైద్యులు తుంటి ఆపరేషన్ చేశారు. దీంతో వైద్యుల సూచనల మేరకు ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు. అందుకే, తొలి విడత అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో అసెంబ్లీకి రానున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కేసీఆర్ అసెంబ్లీ లో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపడతారా లేదా అన్న అంశంపై బీఆర్ఎస్ వర్గాల్లో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కారణం ఆయన మెదక్ ఎంపీ సీటుకు పోటీ చేస్తారని అంతా భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి సభా నాయకుడిగా ఉంటే ప్రతిపక్ష నేతగా ఉండటానికి కేసీఆర్ ఇష్టపడరని అనుకున్నారు. కానీ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని ప్రకటిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ వస్తారని కాంగ్రెస్ సంగతేంటో తేలుస్తారని అంటున్నారు. అందుకే కేసీఆర్ నేరుగా అసెంబ్లీకి వెళ్లి ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వాన్ని కడిగి పారేయాలనుకుంటున్నారని చెబుతున్నారు. రాజకీయాల్లో ఎన్నో చూసిన కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం పెద్ద విషయం కాదంటున్నారు. కేసీఆర్ దెబ్బకు కాంగ్రెస్ ప్రభుత్వం తలకిందులు అవుతుందని బీఆర్ఎస్ వర్గాలంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను తెలంగాణ సర్కార్ ఈ నెలలోనే నిర్వహించే అవకాశం ఉంది. కేసీఆర్ కూడా ఈ సమావేశాలకు రెడీ అవుతున్నారు.