Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఈరోజు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ప్రధాని సీఎం, డిప్యూటీ సీఎంలు భేటీ కానున్నారు. ఎలాంటి విరోధాలు లేకుండా కేంద్ర ప్రభుత్వంతో పాలనా పరమైన సఖ్యత ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారు. రాష్ట్ర అవసరాలు తెలియజేయడంతో పాటు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేయాలని రేవంత్ కోరనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలను మోదీ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు గురించి వివరించనున్నారు.
రాష్ట్రానికి రావాల్సిన వివిధ రకాల గ్రాంట్లను కూడా ప్రధానికి వివరించవచ్చు. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను సడలించి ఇంకా రుణాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని కోరడంతో పాటు కేంద ప్రాయోజిత పథకాలకు కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరనున్నట్లు సమాచారం. అలాగే భట్టివిక్రమార్క ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. ఆరు గ్యారెంటీల విషయాలపై చర్చిస్తారని సమాచారం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పదవులు భర్తీ తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.