»Why Do We Need A Cm Who Doesnt Value Mother And Sister At Home Pawan
Pawan kalyan: ఇంట్లో తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని సీఎం మనకెందుకు: పవన్
యువగళం పాదయాత్ర అనేది జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదని పవన్ కళ్యాణ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్‌ని ఇంటికి పంపించి టీడీపీ, జనసేన సర్కార్‌ను ఆహ్వానిద్దామని పిలుపునిచ్చారు.
తన ఇంట్లో తల్లికి, చెల్లికి విలువ ఇవ్వని ముఖ్యమంత్రి ఎవ్వరికీ అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదని, ముఖ్యమంత్రిని అని వైసీపీ పాలనను చూసి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాం – వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను ఇంటికి పంపిస్తామని పవన్ (Pawan Kalyan) అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని పోలిపల్లి వద్ద టీడీపీ నిర్వహించిన ‘యువగళం – నవశకం’ బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించారు. ఈ సభకు తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
జగన్‌ను ఇంటికి పంపించాలంటే, ఓట్లు చీలిపోకూడదని.. ఓట్లు చీలొద్దనే టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ‘బీజేపీ కూడా దీన్ని అర్థం చేసుకొని ఆశీస్సులు అందిస్తుందని భావిస్తున్నా’ అని ఆయన అన్నారు. టీడీపీతో పొత్తు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని కేంద్రంలోని బీజేపీ పెద్దలకు వివరించానని పవన్ తెలిపారు. ‘మరోసారి వైసీపీ ప్రభుత్వం వస్తే, నాతో సహా అందరూ.. వైసీపీ గూండాలను ఎదుర్కోవడానికి కర్రో, కత్తో పట్టుకోవాల్సి వస్తుందని కేంద్రంలోని పెద్దలకు, అమిత్ షాకు చెప్పాను’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
యువగళం పాదయాత్ర.. జగన్ మాదిరిగా బుగ్గలు నిమిరే యాత్ర కాదంటూ ఎద్దేవా చేశారు పవన్ కళ్యాణ్. ‘నేను నడుద్దామంటే నడిచే పరిస్థితి లేదు. పాదయాత్ర వల్ల చాలా మంది కష్టసుఖాలు తెలుసుకోవచ్చు. అలాంటి అవకాశం నాకు రానందుకు బాధపడుతున్నా. లోకేష్ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆనందంగా ఉంది. ఇది మాటల యాత్ర కాదు. చేతల యాత్ర’ అని పవన్ అన్నారు.