తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి పోలీస్ సిబ్బంది నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది. ముఖ్య అతిథులుగా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్పీ పి పరమేశ్వర రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి కలెక్టర్ శుభాకాంక్షలను తెలిపారు. స్వాతంత్ర్యం రావడానికి ఎందరో త్యాగధనుల కృషి అని వివరించారు. సీఎం జగన్ ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం కృషితో పనిచేయాలని కోరారు. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ శాఖలకు చెందిన శకటాలు, దిశా పోలీస్ వాహనాలు, డాగ్ స్క్వాడ్ విన్యాసాలు ప్రదర్శించారు.
ప్రశంసా పత్రాలు
ఉత్తమ ప్రతిభ కనబరచిన సిబ్బందికి జిల్లా కలెక్టర్, ఎస్పీ పీ పరమేశ్వర రెడ్డి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎస్పీ నేతృత్వంలో 2022లో పోలీస్ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. సిబ్బంది సంక్షేమమే ధ్యేయంగా పనిచేసింది. పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం పోలీసు వెల్ఫేర్ నిధుల నుంచి సుమారు 18 లక్షలు మంజూరు ఇప్పించారు. 40 సంవత్సరాలు వయసు పైబడిన అధికారులు, సిబ్బందికి చిత్తూరు అపోలో ఆసుపత్రిలో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించారు.
కార్పొరేట్ వైద్యం
తిరుపతి పోలీసు సిబ్బందికి స్విమ్స్, రమాదేవి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, రష్ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యం అందించేలా చేశారు. యూరాలజీ సంబంధించిన వ్యాధులకు ఉచితంగా చికిత్స పొందడానికి అవకాశం కల్పించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించి పోలీస్ సిబ్బందికి ఉచితంగా వివిధ పరీక్షలు చేసి, అవసరమైతే చికిత్స చేయించారు.
రూ.4 కోట్లు మంజూరు
పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ కింద 107 మందికి సుమారు రూ. 4 కోట్లు మంజూరు చేయించారు. విధి నిర్వహణలో చనిపోయిన సిబ్బంది కుటుంబ సభ్యులకు రూ. 65 లక్షలు అందజేశారు. గత ఏడాది ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన 2.0 కార్యక్రమం ద్వారా తిరుపతి జిల్లా వ్యాప్తంగా సారాపై అవగాహన కల్పించారు. మొత్తం 32లో 26 గ్రామాలను సారా రహిత గ్రామాలుగా మార్చారు. స్వయం ఉపాధి కింద ఆవులు, గొర్రెలు, దుకాణం పెట్టుకునేందుకు రూ.50 వేల చొప్పున మొత్తం 17 కుటుంబాలకు రూ.8.50 లక్షలు బ్యాంకు నుంచి లోన్ ఇప్పించారు. గత ఏడాతో పోలిస్తే 25 శాతం నేరాలు కూడా తగ్గాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బాలాజీ, అదనపు ఎస్పీలు అడ్మిన్ వెంకటరావు , ఎల్ & వో కులశేఖర్ , క్రైమ్ విమలా కుమారి, ఎఆర్ లక్ష్మీనారాయణ రెడ్డి, డీఎస్పీలు వెస్ట్ నరసప్ప , దిశా రామరాజు , ఎఆర్ నంద కిషోర్ , రవీంద్ర రెడ్డి హోం గార్డ్స్ లక్ష్మణ్ కుమార్ , సీఐ, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు.