volcano eruption: ఇండోనేషియాలోని మౌంట్ మరపి అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. ప్రస్తుతానికి 11 మంది పర్వతారోహకులు మృతిచెందారు. మరో 12 మంది పర్వతారోహకులు గల్లంతు అయ్యారని అధికారులు తెలిపారు. అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగిందనే విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. గల్లంతైన వాళ్లు కూడా మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే మృతులు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. రెండు రోజుల కిందట ఈ పర్వతం ఎక్కేందుకు 75 మంది పర్వతారోహకులు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో పర్వతం విస్ఫోటనం చెందడంతో 11 మంది పర్వతారోహకులు అక్కడిక్కడే చనిపోయారు. 50 మందిని రెస్క్యూ బృందాలు కాపాడగా.. మిగిలిన మృతదేహాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు.
ఇండోనేషియా జియోలాజికల్ శాఖ ప్రకారం మౌంట్ మరపి దేశంలో మూడో అతి పెద్ద అగ్ని పర్వతం. దీని చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల పరిధి వరకు జన సంచారం నిషేధం. ఈ పర్వతం ఎక్కాలంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పరిమితికి మించి ఎక్కువ మంది పర్వతారోహకులు అక్కడికి వెళ్లడం వల్లే ప్రాణ నష్టం అధికంగా ఉందని అధికారులు భావిస్తున్నారు. అగ్ని పర్వతం విస్ఫోటనం తర్వాత బూడిద మూడు వేల మీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. దీంతో ఆ ప్రాంతంలో పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయని, లావా పరిసర ప్రాంతాలకు విస్తరించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని అధికారులు తెలిపారు.