Balakrishna Controversy: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు. తను నటించిన వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో ప్రసంగించిన బాలయ్య.. అక్కినేని తొక్కినేని అంటూ వ్యాఖ్యానించడంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు అక్కినేని ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. వీరసింహారెడ్డి సూపర్ హిట్ అవడంతో ఇటీవల సక్సెస్ మీట్ నిర్వహించారు. విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. సెట్ లో నాన్న గారు డైలాగులు.. ఆ రంగారావు గారు.. ఈ అక్కినేని తొక్కినేని అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం అంటూ చెప్పుకొచ్చారు బాలకృష్ణ. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో చాలామంది తెలుగు సినిమా ఫ్యాన్స్ బాలకృష్ణపై ఫైర్ అవుతున్నారు.
తెలుగు ఇండస్ట్రీకి దిగ్గజ నటులు అయిన వాళ్లపై బాలకృష్ణ ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటంటూ మండిపడుతున్నారు. ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ అయితే బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కినేని తొక్కినేని అంటూ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసిన అక్కినేని నాగేశ్వరరావుపై అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అసలు తెలుగు ఇండస్ట్రీకి ఒక దశ, దిశ చూపిన నటులు ఎన్టీ రామారావు, రంగారావు, నాగేశ్వరరావు. వాళ్ల మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి.. అంటూ ఫైర్ అవుతున్నారు.
Balakrishna Controversy: ఈ వివాదంపై స్పందించిన నాగ చైతన్య, అఖిల్
ఈ వివాదంపై ఏఎన్నార్ మనవళ్లు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ స్పందించారు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావు గారు, ఎస్ వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపరచటం మనల్ని మనమే కించపరుచుకోవటం.. అంటూ నాగ చైతన్య ట్వీట్ చేశాడు. అఖిల్ కూడా అదే ట్వీట్ చేశాడు. ఇద్దరూ ఏఎన్నార్ లివ్స్ ఆన్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.
మరోవైపు బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడటమే కాదు.. బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీకి వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిన్నటి వరకు బాలకృష్ణ గురించి సోషల్ మీడియాలో పాజిటివిటీ ఉండేది. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియా మొత్తం బాలకృష్ణ మీద పడి ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యలపై బాలయ్య స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.