Yamuna River: మళ్లీ డేంజర్ స్థాయికి యమున..ఢిల్లీకి అలర్ట్
గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాదిలో ప్రమాదకర స్థాయిలో పరిస్థితులు మారాయి. యమునా నది ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీవాసులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టారు.
గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. అకాల వర్షాల కారణంగా ఉత్తర భారతంలో జనజీవనం తీవ్ర ఇబ్బందులు నెలకొంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే వరద ముప్పుతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఢిల్లీలో మరోసారి యమునా నది ప్రవాహం ప్రమాదకరస్థాయికి చేరిపోయింది. 205.33 మీటర్లని దాటడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
గత కొద్దిరోజులుగా నీటి మట్టం 205.02 మీటర్లుగా ఉండగా తాజాగా హత్నికుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేశారు. అయితే ఆదివారం ఉదయం 206.07 మీటర్లకు చేరుకోవడంతో యమునా నది డేంజర్ స్థాయికి చేరింది. దీంతో మరోసారి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వరదలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తూ నోటీసులిచ్చారు. హత్నికుండ్ బ్యారేజ్ నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు మంత్రి అతిశీ తెలిపారు.