రాజకీయ పార్టీలకు, నేతలకు మీడియాకు విడదీయరాని బంధం ఉంది. మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా అభివర్ణిస్తారు. ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా వెలుగులోకి తెచ్చి, ప్రజల పక్షాన నిలవాలి. మొదట్లో మీడియా ప్రజాపక్షం వహించేది. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వంత పాడటం ప్రారంభించాయి. గత కొన్నేళ్లుగా సరికొత్త సంప్రదాయం పుట్టుకు వచ్చింది.
ఏ పార్టీకి ఆ పార్టీ, ఆర్థికంగా బలం కలిగిన నాయకులు తమకు, తమ పార్టీకి అనుకూలంగా మీడియా సంస్థలను తీసుకు రావడం ప్రారంభమైంది. ఆ పార్టీ.. ఈ పార్టీ, ఆ నాయకుడు, ఈ నాయకుడు అని లేదు. అన్ని పార్టీల తీరు అలాగే ఉంది. తమ కోసం.. తమ పార్టీ ప్రచారం కోసం.. తమ ప్రయోజనాల కోసం మీడియా సంస్థల్ని తీసుకు వస్తున్నాయి. ఏ పార్టీకి ఆ మీడియా తెలుగు రాష్ట్రాల్లో విభజనకు ముందే కనిపించింది. పదిహేనేళ్ల క్రితం వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ సొంత పేపర్, టీవీని తీసుకురావడంతో తెలుగు రాష్ట్రాల్లో తారాస్థాయికి చేరుకుంది.
తెలుగు పత్రికలు మొదలు, ఇంగ్లీష్ పత్రికల వరకు ఏదో ఒక పార్టీకి వంత పాడుతున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నవే. పారదర్శకంగా, ప్రజాపక్షాన నిలిచే మీడియా సంస్థలు అత్యంత అరుదు. దీనికి తోడు మీడియా రంగం పత్రిక నుండి టీవీకి, టీవీ నుండి ఆన్లైన్ లేదా సోషల్ మీడియాకు విస్తరించాక పుట్టుకు వస్తున్న మీడియా సంస్థలకు లెక్కేలేదు. ఒక్కో పార్టీ, ఒక్కో నేత విస్తృత ప్రచారం కోసం లెక్కలేనన్ని ఛానల్స్‌ను ప్రారంభిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అధికార బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, ఇతర పార్టీలకు అనుకూలంగా పని చేసే మీడియా సంస్థలు కోకొల్లలు. ఆయా పార్టీల్లోని నేతలు తమను తాము హైలెట్ చేసుకోవడానికి కూడా సొంతగా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు.. చేసుకుంటున్నారు.
తాజాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సొంతగా ఛానల్ ప్రారంభించే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే తన సన్నిహితుల ద్వారా సొంత ఛానల్‌ను తీసుకు రావాలని భావిస్తున్నారట. రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినప్పటికీ, సీనియర్ల నుండి ఆయనకు ఎదురు దెబ్బ తగులుతోంది. ఆయనకు అండగా ఉన్న రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో వచ్చే వారి తీరును బట్టి రేవంత్ జోరు, ఆయన వాదనలకు పార్టీలో ఎంత మేర ప్రాధాన్యత ఉంటుందో తెలుస్తుంది. ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఇలాంటి పరిస్థితుల్లో సొంత మీడియా ఉండటం మంచిదని ఆయన భావిస్తున్నారట.