కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర బదల్పూర్ సరిహద్దు నుండి దేశ రాజధాని ఢిల్లీలోకి ప్రవేశించింది. ఈ యాత్ర ఎర్రకోటకు చేరుకుంటుంది. ఉదయం గం.10.30 సమయానికి జైదేవ్ ఆశ్రమానికి చేరుతుంది. ఢిల్లీలోకి ప్రవేశించే సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ వెంట పార్టీ సీనియర్లు పవన్ ఖేరా, భూపేందర్ సింగ్ హుడా, కుమారి సెల్జా, రణ్‌దీప్ సుర్జేవాలా తదితరులు ఉన్నారు. ప్రస్తుతం సామాన్య ప్రజలు తన యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ ప్రేమను పంచితే, బీజేపీ విద్వేషాన్ని నింపుతుందన్నారు. ప్రధాని మోడీ ఇటీవల గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భారీ సభను నిర్వహించారని, అలాగే, రాజస్థాన్ బీజేపీ జన్ ఆక్రోష్ యాత్ర నిర్వహిస్తోందని, కానీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కేవలం తమకు మాత్రమే కోవిడ్ అలర్ట్ అంటూ లేఖలు ఇస్తున్నారన్నారు.
భారత్ జోడో యాత్రకు అంతులేని అభిమానం కనిపిస్తోందని, అందుకే బీజేపీ ఈ యాత్ర పట్ల భయపడుతోందన్నారు రాహుల్ గాంధీ. ఈ పాదయాత్ర ఆశ్రమ్ చౌక్, మథుర రోడ్, ఇండియా గేట్, ఐటీవో మీదుగా ఎర్రకోటకు చేరుకుంటుంది. ఉదయం గం.11 నుండి 1 గంటల వరకు ఆశ్రమ్ చౌక్ వద్దకు వచ్చాక విశ్రాంతి ఉంటుంది. ఎర్రకోటకు చేరుకున్నాక అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. రాహుల్ యాత్ర నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ సూచనలు చేశారు. రాహుల్ భారత్ జోడో యాత్ర 108వ రోజుకు చేరుకుంది.