ఈ ఎన్నికల్లో తాను గెలవకుంటే… ఇవే చివరి ఎన్నికలు అంటూ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా… చంద్రబాబు చేసిన కామెంట్స్ పై మంత్రి బొత్స సత్యానారాయణ స్పందించారు. నిజంగానే చంద్రబాబుకి 2024 ఎన్నికలు చివరి ఎన్నికలు అని బొత్స పేర్కొనడం గమనార్హం.
సీనియర్ మంత్రి బొత్సా కర్నూలులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తధాస్తు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు మళ్ళీ రావటానికి లేదు … ఇది శాసనమని చెప్పుకొచ్చారు. మనం ఏది మాట్లాడినా దేవుడు తథాస్తు అంటాడని చెప్పారు. చంద్రబాబుకు హార్ట్ లేదు, దయ లేదన్నారు.చంద్రబాబు భార్యను ఎవరూ అవమానించ లేదని బొత్సా వివరించారు. అవమానిస్తే ఎవరూ హర్షించరన్నారు. అసెంబ్లీలో రికార్డెడ్ గా ఎవరైనా అన్నారా అని బొత్సా ప్రశ్నించారు. చంద్రబాబును కూడా హిట్లర్ అనే వారని బొత్సా చెప్పారు.
మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇదే విషయం పైన మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని పేర్కొన్నారు. చంద్రబాబుకే కాదు టీడీపీకీ ఇవే చివరి ఎన్నికలని వివరించారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారన్నారు. ఎవర్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు.
చంద్రబాబు పోటీ చేయకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదని వ్యాఖ్యానించారు. తులసి నీళ్ళు పోస్తేనే బ్రతుకుతాను అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని అమర్నాధ్ పేర్కొన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్స్ట్రా ప్లేయర్ గా మంత్రి అమర్నాధ్ అభివర్ణించారు. చంద్రబాబుకు సత్తా ఉంటే 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పాలని మంత్రి డిమాండ్ చేసారు.