»Telangana Cm K Chandrashekar Rao Decided To Bid For Expression Of Interest Eoi On Vizag Steel Plant
Visakha ఉక్కుపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం.. నేరుగా రంగంలోకి
ఒకవేళ ఈ బిడ్ ను తెలంగాణ ప్రభుత్వం పొందితే మాత్రం ఏపీలో సీఎం కేసీఆర్ కు ఊహించని అభిమానం పెరుగుతుంది. ఏపీలోకి ప్రవేశించేందుకు ఇది ఒక సింహద్వారంగా మారనుంది.
పోరాడి సాధించుకున్న విశాఖపట్టణంలోని (Visakhapatnam) ఉక్కు ఫ్యాక్టరీని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం అమ్మేసేందుకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం విశాఖలోనే (Vizag Steel Plant) ఉంది. మంచి లాభాలు సంపాదించి పెడుతున్న ఈ కర్మాగారాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోంది. దీనిపై కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా ఏపీ సీఎం జగన్ (YS Jagan) మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు. ఫ్యాక్టరీని విక్రయించొద్దు అనే ఒక్క మాట జగన్ కానీ, వైఎస్సార్ సీపీ కానీ అనలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) మాత్రం ఉక్కు కర్మాగారాన్ని అమ్మేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrashekar Rao), మంత్రి కేటీఆర్ (KT Rama Rao), ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు విశాఖ ఉక్కు కర్మాగారంపై మాట్లాడారు. ఫ్యాక్టరీని అమ్మేయొద్దని బహిరంగంగా డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ (BRS Party) మద్దతు పలికింది. అన్నట్టుగా మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణకు మూలధనం, ముడి సరుకుల కోసం నిధులు ఇచ్చి.. నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) (Expression of Interest -EOI) ప్రతిపాదనల బిడ్డింగ్ (Bid) నిర్వహిస్తున్నది. ఈ బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొని బిడ్ పొందాలని నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి లేదా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, నీటి పారుదల శాఖ పాల్గొని బిడ్ దక్కించుకునేందుకు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ (Hyderabad)లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధికారులతో సమావేశమయ్యారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు ఉన్న చర్యలపై సమాలోచనలు చేశారు.
ఈ బిడ్ దక్కించుకుంటే తెలంగాణలో చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉక్కు సమకూర్చుకోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం తీవ్రతరం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఈ లక్ష్యాలతో విశాఖ ఫ్యాక్టరీ వేసే బిడ్డింగ్ లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ బిడ్ ప్రతిపాదనల కోసం వెంటనే విశాఖపట్టణం వెళ్లి అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ రోజు లేదా రేపు ఆ బృందం విశాఖకు వెళ్లనుంది. మొదటి నుంచి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇప్పటికే విశాఖలో ఉద్యమం కూడా మొదలుపెట్టించారు. చంద్రశేఖర్ సహకారంతో తెలంగాణ అధికారులు ఈ బిడ్ లో పాల్గొనున్నారు. ఒకవేళ ఈ బిడ్ ను తెలంగాణ ప్రభుత్వం పొందితే మాత్రం ఏపీలో సీఎం కేసీఆర్ కు ఊహించని అభిమానం పెరుగుతుంది. ఏపీలోకి ప్రవేశించేందుకు ఇది ఒక సింహద్వారంగా మారనుంది. ఈ పరిణామాలు సీఎం జగన్ పై మాత్రం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.