»No Such Objection Saw Everywhere Somireddy On Yuvagalam
Somireddy: ఇంతటి ఆంక్షలు చూడలేదన్న సోమిరెడ్డి
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు.
తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను అడ్డుకునేందుకు వైయస్ జగన్ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తోందని మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. ఇలాంటి అడ్డంకులు, ఆంక్షలు తాము ఎక్కడా ఇంత వరకు కనీవినీ ఎరగలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, రాష్ట్రంలో ఎంతో మంది నేతలు పాదయాత్రలు చేశారని, కానీ ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు. జీవో నెంబర్ వన్ పేరుతో పాదయాత్రకు పోలీసులు ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పేద, గిరిజన కుటుంబాలను కాపాడాలని శ్రీవారిని వేడుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా మంచి పరిపాలన అందించాలని కోరుకున్నానన్నారు.
అంతకుముందు రోజు ఆయన వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ట్వీట్ చేశారు. కోర్టు దొంగ… వ్యవసాయ మంత్రి ఏం పీకుతున్నాడంటూ పోస్ట్ పెట్టారు. ఇందులో ‘దళారులను నమ్మి మోసపోయిన రైతులకు నువ్వు ఇచ్చిన హామీ ఏమైంది. మొత్తం పది కోట్లలో నీ వాటా ఎంత అవినీతి తిమింగళం కాకాణి. నువ్వు అమ్మే నకిలీ మద్యంలా, నీ మాటలు కూడా నకిలీవే’ అని పేర్కొన్నారు. అంతకుముందు లోకేష్ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు సోమిరెడ్డి. తన హయాంలో డిక్షన్ కంపెనీని ఏపీకి తీసుకు వచ్చామని, రూ.100 కోట్లను ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేసిందని, దీంతో 1000 మందికి ప్రత్యక్షంగా, 5000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి లభించిందని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన నాలుగేళ్లలో ఇలాంటి కంపెనీని ఒక్కటైనా తీసుకు వచ్చారా చెప్పాలని సవాల్ చేశారు. ఈ లోకేష్ ట్వీట్‌ను సోమిరెడ్డి రీట్వీట్ చేశారు.
నారా లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తుందని తెలుగుదేశం పార్టీ నేతలు మొదటి నుండి ఆరోపిస్తున్నారు. తాజాగా సత్యవేడు నియోజకవర్గంలో యువ గళం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, బ్యానర్లను పోలీసులు తొలగించారు. మరోవైపు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించింది. పాదయాత్ర రూట్ మ్యాప్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు (Shivratri) జరుగుతున్నందున శ్రీకాళహస్తి పట్టణ చతుర్మాడా వీధుల్లోకి పాదయాత్రకు ప్రవేశం లేదన్నారు. అంతకుముందు పలుచోట్ల టీడీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. లోకేష్ కూడా పోలీసులతో వాదనకు దిగిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల స్టేజ్‌కు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో బిల్డింగ్ ఎక్కి మాట్లాడారు నారా లోకేష్. ఆ తర్వాత బిల్డింగ్ ఎక్కడానికి అనుమతి ఇవ్వని సందర్భంలో స్టూల్ పైన నిలబడి మాట్లాడారు. మైక్ లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. ఇలా అడుగడుగునా పాదాయాత్రకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని తెలుగు దేశం పార్టీ కేడర్ ఆరోపిస్తోంది. లోకేష్ యువ గళం పాదయాత్ర నిన్న 21వ రోజు. ఆయా ప్రాంతాల్లో పాదయాత్ర ముగిసిన అనంతరం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘యువ గళం-జనవాణి’ పేరుతో జగన్‌కు ప్రశ్నల వర్షం కురిపిస్తూ పోస్ట్ పెడుతున్నారు.