BYJU : కొద్దిరోజుల తర్వాత బైజూస్ ఆఫీసులు ఖాళీ అవుతాయని తెలుస్తోంది. నగదు కొరతతో కంపెనీ సతమతమవుతోంది. దీంతో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. పలు వర్టికల్స్‌ను, కార్యాలయాలను ఒకదాని తర్వాత ఒకటి మూసివేసింది. ఇప్పుడు మరోసారి బైజూస్‌లో పెద్ద ఎత్తున లేఆఫ్ ప్రకటించారు. తాజా రౌండ్ లేఆఫ్‌లలో సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారిని తొలగిస్తున్నట్లు బైజూస్ ప్రకటించింది. ఇందుకోసం ఉద్యోగులకు ఎలాంటి ముందస్తు నోటీసుల లాంటివేవీ ఇవ్వలేదు. బైజూస్‌లో ఈసారి తగ్గింపు 500 మంది ఉద్యోగులను ప్రభావితం చేయవచ్చు. ఈసారి ఈ ఉద్యోగులకు మార్చి 31న హెచ్ఆర్ విభాగం నుంచి కాల్ వచ్చింది. కాల్ సమయంలో కంపెనీ వారిని తొలగిస్తున్నట్లు మీకు మార్చి 31 లాస్ట్ వర్కింగ్ డే అని పేర్కొంది.
బైజూస్‌లో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గత నెల ప్రారంభంలో ఈ ఆన్లైన్ ఎడ్టెక్ కంపెనీ దాని 20 కంటే ఎక్కువ ప్రాంతీయ కార్యాలయాలను మూసివేసింది. ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, పూణె, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో వీటిని మూసేశారు. ఆ తర్వాత కంపెనీ సీఈవో అర్జున్ మోహన్ నేతృత్వంలో కొన్ని నెలల క్రితమే తమ కార్యాలయ స్థలాన్ని పునర్నిర్మించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పుడు ఖర్చులను తగ్గించుకునేందుకు అన్ని ప్రాంతీయ కార్యాలయాలను మూసివేయాలన్న నిర్ణయానికి తుది ఆమోదం లభించింది. దీని తర్వాత కంపెనీ తన 30 ట్యూషన్ సెంటర్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌ని కొనుగోలు చేసిన తర్వాత, బైజూస్ కూడా దేశవ్యాప్తంగా తన ట్యూషన్ సెంటర్లను తెరవడం ప్రారంభించింది. మార్చి చివరి నాటికి దాని 292 ట్యూషన్ సెంటర్లలో 30 మూతపడ్డాయి. బైజూస్ ఖర్చులను తగ్గించుకునే చర్యలలో ఇదొకటి అని చెప్పారు.