»Why Imposed Ban On Rat Glue Pads Peta India Fight On Rat Glue
Rat Glue Traps : పెటా పోరాటం.. ఇక ర్యాట్ గ్లూ ట్రాప్లు ఆన్లైన్లో దొరకవు
ర్యాట్ గ్లూ ప్యాడ్ల వల్ల ఎలుకలు చాలా దారుణాతి దారుణంగా హింసకు గురై చనిపోతున్నాయని పెటా పోరాటానికి దిగింది. దీంతో బడా ఆన్లైన్ స్టోర్ల నుంచి ఇవి గల్లంతు అవుతున్నాయి.
Rat Glue Traps : మార్కెట్లో విరివిగా దొరికే ర్యాట్ గ్లూ ప్యాడ్లు ఇకపై కనుమరుగుకానున్నాయి. పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆనిమల్స్((PETA) చేసిన పోరాటంతో ఇప్పుడు ప్రముఖ ఆన్లైన్ స్టోర్లు అన్నింటిలోనూ వీటిని తొలగిస్తున్నారు. ఈ మేరకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్రధాన ఇ కామెర్స్ వెబ్ సైట్లు అన్నీ ఇప్పుడు ఈ ప్యాడ్లను అన్లిస్ట్ చేశాయి. పెటా ఇండియా పోరాటం వల్లనే ఈ కదలిక వచ్చింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ వీటి వాడకంపై నిషేధం ఉంది.
మనుషులు తమ స్వార్థం కోసం మూగ జీవులను అమానుషంగా చనిపోయేట్లు చేయడం సరికాదని పెటా ఇండియా పోరాడింది. ర్యాట్ గ్లూ ప్యాడ్లను(GLUE PADS) ఎలుకలు ఎక్కువగా తిరిగే చోట ఉంచి అలా వదిలేస్తారు. అటుగా వెళ్లే ఎలుకల్లాంటివి ఆ జిగురుకు అంటుకుపోయి నరకయాతన అనుభవిస్తాయి. కొన ఊపిరి ఉన్నంత వరకు దానికే అతికి ఉండిపోయి బతికి ఉండగానే చిత్రహింస అనుభవిస్తాయి. తిండి, నీరు లాంటివి లేక ఆకలితో మాడిపోయి చివరికి మరణిస్తాయి. ఇంతటి హింస పెట్టి వాటిని హతమార్చడం అమానుషం అని పెటా ఇండియా పోరాటం మొదలు పెట్టింది.
ఈ గ్లూ ట్రాప్లను నిషేధించాలంటే పెద్ద ఎత్తున పెటా పోరాడరింది. దీంతో దేశ వ్యాప్తంగా ఈ పోరాటానికి మద్దతు లభించింది. అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, జియో మార్ట్ లాంటివి ఇకపై ఈ ట్రాప్లను విక్రయించబోమంటూ నిర్ణయం తీసుకున్నాయి. అన్లిస్ట్ చేశాయి. దీంతో పెటా ఇండియా(PETA INDIA) హర్షం ప్రకటించింది. మిగిలిన సంస్థలూ ఇదే బాటలో నడవాలని కోరింది. సంపూర్ణంగా వీటి నిషేధం అయ్యే వరకు తాము పోరాడతామని ప్రకటించింది.