బటర్ చికెన్, దాల్ మఖానీలను తామే కనిపెట్టామంటూ రెండు రెస్టారెంట్లు కొట్టుకున్నాయి. చివరికి ఈ విషయమై దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో ఇప్పుడు ఈ విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వార్తను అంతర్జాతీయ మీడియా సైతం ఆసక్తిగా రాస్తుండటం విశేషం.
Butter Chicken Origin Issue : నాన్వెజిటేరియన్లకు ఎంతో ఇష్టమైన వంటకం బటర్ చికెన్. అలాగే వెజిటేరియన్లకు మరెంతో ప్రియమైన వంటకం దాల్ మఖనీ. ఇప్పుడు ఈ రెండింటినీ తాము కనిపెట్టామంటే, తాము కనిపెట్టామని రెండు రెస్టారెంట్లు దెబ్బలాడుకుంటున్నాయి. చివరికి ఈ పంచాయతీ దిల్లీ హైకోర్టుకు చేరడంతో ఇప్పుడు అంతా ఈ విషయమై ఆరా తీస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే…
దిల్లీలోని మోతీ మహల్ రెస్టారెంట్ యజమానులు బటర్ చికెన్(Butter chicken), దాల్ మఖానీ వంటకాలను తమ పూర్వీకులు కనుగున్నారని చెబుతున్నారు. అయితే ఈ వంటకాలపై దర్యాగంజ్ రెస్టారెంట్ వాళ్లు తప్పు దోవ పట్టిస్తున్నారని మోతీ మహల్(Moti Mahal) యజమానులు గత జనవరిలో కోర్టును ఆశ్రయించారు. ఇక అప్పటి నుంచి ఈ అంశంపై వివాదం నడుస్తోంది. అయితే మోతీమహల్ చేస్తున్న వ్యాఖ్యలపై దర్యాగంజ్ వాళ్లు ఇప్పుడు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ విషయమై దిల్లీ హైకోర్టు దర్యాగంజ్‌కు సమన్లు జారీ చేసింది. బటర్ చికెన్, దాల్ మఖానీలను తామే కనిపెట్టామంటూ వారు ఉపయోగించుకుంటున్న ట్యాగ్ లైన్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. వెబ్సైట్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం లాంటి సోషల్ మీడియా హ్యాండిళ్ల నుంచి ఆ ట్యాగ్ లైన్లను ప్రస్తుతానికి తొలగించాలని తెలిపింది. ఈ విషయమై మోతీమహల్ యజమానులు కోర్టులో దావా వేసినప్పుడు తమ పూర్వికుడైన కుందన్ లాల్ గుజ్రాల్ మొదట తందూతీ చికెన్‌ని తయారు చేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత బటర్ చికెన్, దాల్ మఖానీలను సైతం ఆయనే తయారు చేశారని పేర్కొన్నారు. దేశ విభజన అనంతరం తాము ఈ వంటకాలను భారత దేశానికి తీసుకొచ్చామని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని దర్యాగంజ్(Daryaganj)యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ విషయమై లిఖిత పూర్వక ప్రకటన దాఖలు చేయాలని దర్యాగంజ్‌కు దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్తను అంతర్జాతీయ పత్రికలు సైతం ఆసక్తిగా రాస్తుండటం విశేషం.