ఉత్తరాంధ్రుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను మాట్లాడుతానని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. తెలంగాణలో నివసిస్తున్న ఉత్తరాంధ్ర కులాలను బీసీలుగా గుర్తించేందుకు అవసరమైతే సీఎం కేసీఆర్ ను కోరుతానని ప్రకటించారు. కళింగ సామాజిక వర్గం మొత్తం తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో సోమవారం నిర్వహించిన కళింగ ఆత్మీయ వేదికకు స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ దువ్వాడ శీను హాజరయ్యారు.
ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. కళింగ సామాజిక వర్గానికి అత్యధిక గౌరవం ఇచ్చిన నాయకుడు సీఎం జగన్ అని తెలిపారు. మీకు గౌరవం ఇచ్చిన పార్టీకి మద్దతుగా నిలవడం అవసరమని కళింగ ప్రజలకు గుర్తు చేశారు. కళింగ సామాజిక వర్గం ఎప్పుడూ వైఎస్సార్సీపీ వెంటే ఉంటుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర 36 కులాలు తెలంగాణలో కీలకంగా ఉన్నాయని, వారి కోసం కేసీఆర్ తో మాట్లాడి బీసీలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. టెక్కలిలో ఎమ్మెల్యేగా గెలవడంతోనే కళింగులకు ప్రాధాన్యమని ఎమ్మెల్సీ శ్రీను తెలిపారు. కళింగులకు వ్యతిరేకంగా పనిచేసే నాయకులు, పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా నాయకత్వాన్ని కళింగులకు అప్పగించాలని సీఎం భావిస్తున్నట్లు పేర్కొన్నారు.