తాను ఒక రాజకీయంగా ఫెయిల్యూర్ ని అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో.. తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఆయన.. ఇలా తాను ఫెయిల్యూర్ అంటూ కామెంట్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇంతకీ అసలు మ్యాటరేంటంటే… శిల్పకళావేదికలో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంంటెంట్స్ ఆఫ్ ఇండియా సదస్సులో పవన్ ”ఫేసింగ్ ది ఫ్యూచర్” అంశంపై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లో విఫలమయ్యానని కానీ ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్తులో విజయానికి పునాదులు వేస్తాయని అన్నారు. తాను విఫల రాజకీయ నాయకుడినని అనగానే.. అక్కడున్న విద్యార్థులు.. ‘కాదు’.. అని కేకలు వేశారు. సీఎం సీఎం అని నినాదాలు చేశారు. ఇక వైఫల్యం ఎలాగైతే తాత్కాలికమైనదో.. విజయం కూడా తాత్కాలికమైనది అని అన్నారు. విజయాన్ని నెత్తికెక్కించుకోకూడదని అన్నారు.సమాజంలో మార్పు కావాలని కోరుకునే చాలా మంది ఏమీ చేయడం లేదన్న పవన్ నేను అలా కాదు నా ప్రయత్నంతో ఎంతో కొంత సాధించానని నమ్ముతానని అన్నారు.
2014లో జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్..ఆ ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మాత్రం మద్దతిచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి… ప్రభుత్వన్ని ఏర్పాటు చేసింది కానీ జనసేన కలిసి నడవలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి గుడ్‌బై చెప్పి వామపక్ష పార్టీలు, బీఎస్పీతో జతకట్టి.. ఎన్నికల్లో పోటీ చేశారు.
ఐతే జనసేన పార్టీ నుంచి ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు. రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయినా ఆయన తర్వాత కాలంలో వైసీపీకి జై కొట్టారు. ఆయితే పార్టీ అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్.. తాను పోటీ చేసిన రెండు నియోజక వర్గాల్లోనూ ఓడిపోయారు. అయినా నిలబడి రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ పార్టీతో ఆయన కలిసి పని చేస్తూ 2024 ఎన్నికల కోసం సిద్ధం అవుతున్నారు..