సివిల్స్ ఫలితాల్లో(Civils Results) దినసరి కూలీ కొడుకు సత్తాచాటాడు. ఎస్సీ స్టడీ సర్కిల్(Sc Study Circle)లో చదివి ర్యాంకు సాధించాడు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ చౌడారపు శ్రీధర్ ప్రకటనలో తెలిపారు. జనగాం జిల్లాకు చెందిన కొయ్యాడా ప్రభాకర్ కుమారుడు కొయ్యాడా ప్రణయ్ కుమార్ మొదటిసారి సివిల్స్ రాసి 885వ ర్యాంకు సాధించాడు. ప్రణయ్ తండ్రి ఓ దినసరి కూలీ. ప్రణయ్ మేడ్చల్ జిల్లా నాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివాడు. పాలిటెక్నిక్ అయ్యాక జేఎన్టీయూలో బీటెక్ చదివాడు.
మరోవైపు సివిల్స్ ఫలితాల్లో(Civils Results) మధ్యాహ్న భోజన కార్మికురాలి కొడుకు డోంగ్రి రేవయ్య ఆలిండియా స్థాయిలో 410వ ర్యాంకు సాధించాడు. కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం తుంగెడ గ్రామానికి చెందిన డోంగ్రి విస్తారుబాయి అదే ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తోంది. ఆమె భర్త మనోహర్ 25 ఏళ్ల క్రితం మృతిచెందాడు. కూలి పనులు చేసుకుంటూ ఆమె తన ముగ్గురు పిల్లలను పోషించేది. పెద్ద కొడుకు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుండగా ఇప్పుడు రెండో కుమారుడు రేవయ్య సివిల్స్ ర్యాంకు సాధించాడు. 2022లో కేవలం రెండు మార్కులతో సివిల్స్ ర్యాంకును రేవయ్య కోల్పోయాడు. ఈసారి పట్టుదలతో చదివి లక్ష్యాన్ని సాధించాడు.