»Revanth Reddy The Unemployed In The Telangana Will Hear Good News On December 9
Revanth Reddy: రాష్ట్రంలో నిరుద్యోగులు డిసెంబర్ 9న శుభవార్త వింటారు
రాష్ట్రంలో లక్షలమంది విద్యార్థులు, ఉద్యోగార్థుల జీవితాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే కేసీఆర్ ను గద్దె దింపాలని అన్నారు.
తెలంగాణలోని ఉద్యోగార్థులు అనవసరంగా ప్రాణాలు తీసుకోవద్దని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy)కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా వెల్లడించారు. నిరుద్యోగ యువత రెండు నెలలు ఓపిక పట్టాలని యువతకు సూచించారు. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న నిరుద్యోగులకు శుభవార్త చెబుతామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగాలంటే సీఎం కేసీఆర్ గద్దె దిగాలని వ్యాఖ్యానించారు. అంతేకాదు కేసీఆర్(KCR) ప్రభుత్వం రాష్ట్రంలోని 32 లక్షల ఉద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. జిరాక్స్ కేంద్రాల్లో పరీక్ష పత్రాలు దొరకడం ప్రభుత్వ వైఫల్యం కాదా అంటూ రేవంత్ ప్రశ్నించారు. అంతేకాదు సింగరేణి ఉద్యోగాల విషయంలో కూడా ఇలాగే నిర్ల్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ఇలా గత 9 ఏళ్లలో అనేక పోటీ పరీక్షల విషయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని రేవంత్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ పరీక్షల విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఆమెపై అబాండాలు వేయడం సరికాదని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు, విద్యార్థులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆమె రాసిన లేఖలో ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా చెప్పిందన్నారు.