HYD: ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆయన సతీమణి సుదేష్ ధన్‌ఖడ్లకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రోటోకాల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ వెంకట్‌రావు, డీజీపీ జితేందర్ ఇతర అధికారులు వీడ్కోలు పలికారు. రాష్ట్రంలో 2 రోజులపాటు పర్యటించిన ఉపరాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు.
NRML: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపై ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సంతాపం ప్రకటించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులను తీసుకువచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ కే దక్కుతుందన్నారు. మాజీ ప్రధాని మంత్రి పీవీ నరసింహారావుతో కలిసి దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన చక్కదిద్దారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
SRD: కస్తూర్బా పాఠశాల ఉద్యోగులు సమ్మెలో ఉండడంతో, వారి స్థానంలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉద్యోగుల సమ్మె వల్ల విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకే ఉపాధ్యాలను సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు అధైర్యపడొద్దన్నారు.
PDPL: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఎమ్మెల్యే విజయ రమణారావు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన వివిధ హోదాల్లో దేశానికి విశేష సేవలందించారు. నూతన భారతదేశానికి పునాదిని అందించి, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా, వినయపూర్వకమైన నాయకుడిగా గుర్తుండిపోతారని అన్నారు.
ADB: జైనథ్ మండలంలోని సాత్నాల ప్రాజెక్టు వివరాలను అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 25 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 282.10 అడుగులుగా ఉందని పేర్కొన్నారు. ఇన్ ఫ్లో 25 క్యూసెక్కులుగా ఉందని తెలిపారు.
KMM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి, అభిమానులకు పొంగులేటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు.
KMM: జిల్లాలోని బొమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ఛైర్మన్ బొమ్మ రాజేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 16కంపెనీల బాధ్యులు పాల్గొని ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారని వెల్లడించారు. ఈమేరకు 2020 నుండి ఇప్పటి వరకు బీటెక్, బీ పార్మసీ, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన పాల్గొనవచ్చని తెలిపారు.
కామారెడ్డి: కామారెడ్డి పట్టణం లింగాపూర్ గ్రామం 11, 9వ వార్డుల బీజేపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థాగత మార్పుల్లో భాగంగా 193వ బూత్ అధ్యక్షుడిగా సంగి రాజేందర్‌ను, 194 బూత్ అధ్యక్షుడిగా దుబాసి భూపాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు భరత్ పాల్గొన్నారు.
HYD: నాటి ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో, జీడీపీ వృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించారు. దాదాపు దశాబ్ద కాలం పాటు దేశ ప్రధానిగా సుదీర్ఘ సేవలు అందించి తనదైన ముద్రవేసిన గొప్ప వ్యక్తి, ఆలోచనపరుడని ఎమ్మెల్యే ముఠా గోపాల్ శుక్రవారం తెలిపారు.
మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా, డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, మాధవి దంపతుల కుమారుడు ఆదిత్య రెడ్డి, కూతురు సహస్ర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మర్కుక్ మండలం ఎర్రబెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఎన్నికలు పార్టీ వ్యవహారాల గురించి చర్చించారు.
HYD: జనవరి 1 నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్) 46 రోజులపాటు మహానగర వాసులను అలరించనుంది. ఈ 84వ నుమాయిష్‌లో 2,200 స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. అంతేకాక పలు ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. 160 సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా వేసి నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు.
మహబూబాబాద్: కురవి మండల కేంద్రంలో నేడు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలను జాతీయ అధ్యక్షులు విపి సాను ప్రారంభించారు. విద్యార్థుల సమస్యలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామేర కిరణ్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ప్రశాంత్, దాసరి ప్రశాంత్, గజ్జెల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ADB: జిల్లా మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,521గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,920గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
KMR: బిక్కనూర్ మండలం తిప్పాపూర్ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం, కాచాపూర్ గ్రామంలోని విశ్వేశ్వర ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం వాయిదా వేసినట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమ్ రెడ్డి తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం పట్ల ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటించినందున, కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
HYD: తెలుగు వికీపీడియా పై అందరికీ అవగాహన అవసరమని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ అన్నారు. తెలుగు వికీపీడియాలో లక్ష వ్యాసాలు దాటిన సందర్భంగా హైదరాబాద్ బుక్‌ఫెయిర్ వేదికగా లక్ష వ్యాసాల ప్రస్థానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వికీపీడియా గురించి మీకు తెలుసా..? అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.