మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నామని కొన్ని సంఘటనలు చూస్తే సందేహం వస్తుంటుంది. ఇంకా కులాలు, మతాలు అని పట్టుకు కూర్చుంటే నాగరిక సమాజం వైపు ఎప్పుడూ అడుగులు వేస్తాం. ప్రపంచ దేశాలతో ఎలా పోటీ పడతాం? తాజాగా ఓ యువతి దళితుడిని వివాహం చేసుకుందనే నెపంతో ఆ అమ్మాయిని, ఆమె కుటుంబసభ్యులను కులం నుంచి బహిష్కరించారు. అయితే ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు చేరడంతో కేసు నమోదైంది. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
వీఎం బంజర్ పోలీసుల వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం మండలాపాడు గ్రామానికి చెందిన పెండ్ర రాంబాబు కుమార్తె, అదే గ్రామానికి చెందిన దళిత యువకుడిని ప్రేమించి పెళ్లాడింది. కులాంతర వివాహం చేసుకోవడంతో కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీన సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో కుల పంచాయతీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాంబాబు కుటుంబసభ్యులను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు తీర్మానించారు. దీనికి సంబంధించిన ఓ పత్రాన్ని ఆమె పెద్దలకు అందించారు. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి తాత గోపాలరావు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 13 మంది కుల పెద్దలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఎస్సై సూరజ్ అవగాహన కల్పించారు.