Raja singh: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. గోషామహల్ ఎమ్మేల్యే రాజాసింగ్‌పై బీజేపీ విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. త్వరలో బీజేపీ విడుదల చేయనున్న తొలి జాబితాలోనే రాజా సింగ్ పేరు ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా రాజాసింగ్ నిలిచారు. ఇలాంటి సమయాల్లో ఆయనను దూరం చేసుకుంటే పార్టీకి నష్టం తప్పదని భావించి.. సస్పెన్షన్ ఎత్తివేశారని వర్గాలు చెబుతున్నాయి. మరోసారి ఆయన గోషామహల్ నుంచి పోటీ చేయనున్నారని సమాచారం.
గతేడాది ఆగస్టులో స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుక్‌పై రాజాసింగ్ కొన్ని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. శాసనసభపక్ష నేత పదవి నుంచి కూడా పార్టీ తొలగించింది. ఆయనపై కేసులు నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లివచ్చారు. ప్రస్తుతం బెయిల్ మీద బయటకు వచ్చారు. రాజా సింగ్ గోషామహల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఇంతకు ముందే చెప్పారు. కానీ తాజాగా అతనిని వేరే చోటు నుంచి పోటీ చేయించాలని పార్టీ భావిస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.