భారత రాష్ట్ర సమితితో (BRS) తాము దేశంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వచ్చే ఎన్నికల కంటే ముందే తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయన్నారు. బీజేపీకి సరైన సమయంలో బుద్ధి చెబుతామన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ తెలంగాణ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మను కూడా అవమానించేలా మాట్లాడాతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రకటనతో బీజేపీ బ్రెయిన్ చెడిపోయిందన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని, బండి సంజయ్ తనను అవహేళన చేశారన్నారు. బెంగాల్ ప్రజలు బీజేపీకి బుద్ది చెప్పినట్లుగానే, తెలంగాణ ప్రజలు చెబుతారన్నారు.
కేసీఆర్ చేసే యాగాలపై బీజేపీ, విపక్షాలు చేసే విమర్శలపై కవిత స్పందించారు. తన తండ్రికి యాగాలు కొత్త కాదని, బీఆర్ఎస్కు దైవశక్తి అవసరం కాబట్టి యాగాలు చేస్తున్నామన్నారు. మున్ముందు తమ పార్టీలోకి వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయన్నారు. ఢిల్లీ స్థాయిలో బీజేపీకి తమ పార్టీయే ప్రత్యామ్నాయం అవుతుందన్నారు. బీజేపీకి కూటములను ఏకం చేస్తామని, ఆయా రాష్ట్రాలను బట్టి అక్కడి పార్టీలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చెప్పారు.
బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పైన పోటీకి సంబంధించి మరోసారి స్పందించారు కవిత. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, కేసీఆర్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ సిద్ధమన్నారు. అయితే ధర్మపురి అరవింద్ ఎక్కడ పోటీ చేసినా, తాను అక్కడకు వెళ్లి ప్రచారం చేసి మరీ ఓడిస్తానని చెప్పారు.