Arvind Kejriwal : దొంగలంతా ప్రధానమంత్రికి సంబంధించిన పార్టీలోనే ఉన్నారని దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలుకెళ్లిన కేజ్రీవాల్ బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసింది. బయటకు వచ్చిన ఆయన ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
ప్రచారంలో పాల్గొన్న తొలి రోజునే కేజ్రీవాల్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విమర్శల వర్షం కురిపించారు. ప్రధాన మంత్రి ఆమ్ ఆద్మీ పార్టీని హింసించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. స్వాతంత్ర్యం తర్వాత తమ పార్టీ అంతగా మరే పార్టీ వేధింపులకు గురి కాలేని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి పని చేస్తున్నానని చెబుతారు గాని నిజానికి ఆ బీజేపీలోనే దొంగలంతా ఉన్నారని ఆయన ధ్వజమెత్తారు.
ఓ కుంభకోణంలో పాత్ర ఉన్న వ్యక్తిని గత పది రోజుల క్రితం కూడా బీజేపీలో చేర్చుకున్నారని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. అదే తమ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టిన తర్వాత ఒకరిపై అవినీతి ఆరోపణలు రుజువైతే తాము వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని తెలిపారు. అవినీతిపై పోరాటం అంటే అలా ఉండాలని కాని అలాంటి వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించడం ఏమిటని ప్రశ్నించారు.