Pratibha Patil Health : భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.
పుణేలోని భారతీ ఆసుపత్రిలో బుధవారం రాత్రి అడ్మిట్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధ పడుతుండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు.
ప్రతిభా పాటిల్ భర్త దేవీ సింగ్ షెకావత్(89) గతేడాది ఫిబ్రవరిలో కన్ను మూశారు. పూనేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండె పోటుతో మరణించారు. ఈ ఘటన ఏడాది తర్వాత ఇప్పుడు ప్రతిభా పాటిల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. భారత తొలి మహిళా రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ చరిత్రలో నిలిచారు. 2007 నుంచి 2012 వరకు ఆమె రాష్ట్రపతిగా దేశానికి సేవలు అందించారు. అంతకంటే ముందు 2004 నుంచి 2007 వరకు రాజస్థాన్ రాష్ట్ర గవర్నర్‌గానూ పని చేశారు. 1991లో జరిగిన ఎన్నికల్లో లోక్ సభకు పోటీ చేసి ఎంపీగా గెలుపొంది పార్లమెంటులో అడుగుపెట్టారు.