Kalki 2898 AD Movie Review: కల్కి మూవీ ఎలా ఉందంటే?
పాన్ ఇండియా ప్రభాస్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఎన్నో అంచనాలతో ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రముఖ నటులు నటించడంతో ఈ చిత్రంపై ఓ రేంజ్లో అంచనాలు పెరిగాయి. విడుదలైన టీజర్, ట్రైలర్‌తో ఊహించని విధంగా సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
సినిమా స్టోరీ కల్కి 2898 ఏడీలో జరుగుతుంటుంది. ప్రపంచంలో చిట్టచివరి నగరంగా కాశీ ఉంటుంది. కలియుగాంతంలో మిగిలి ఉన్న మనుషులు ప్రపంచంలోని చివరి నగరంగా ఉన్న కాశీలో జీవిస్తుంటారు. ఒకపక్క భూమి మీద ఉన్న అన్ని వనరులను సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) లాక్కోని కాంప్లెక్స్ అనే ఒక ప్రత్యేక ప్రాంతాన్ని సృష్టిస్తాడు. మరోపక్క శంబాలా అనే ప్రాంతంలో కాంప్లెక్స్‌కు తెలియకుండా బ్రతుకుతుంటారు. భూమి మీద ఉండే వనరులను బంధించడం కరెక్ట్ కాదని కాంప్లెక్స్ మీద పోరాడుతూ శంబాలా నగరంలో మరియమ్మ(శోభన) ఆధ్వర్యంలో బ్రతుకుతుంటారు. కాశీలో ఉండే వాళ్లు కాంప్లెక్స్‌లోకి వెళ్లాలంటే వన్ మిలియన్ యూనిట్స్ కట్టాలనే రూల్ ఉంటుంది. ఎలాగైన వన్ మిలియన్ యూనిట్స్ సంపాదించి కాంప్లెక్స్ లోపలికి ప్రవేశించాలని భైరవ(ప్రభాస్) బౌంటీ హంటర్‌గా పనిచేస్తుంటాడు. చిన్నచిన్న బౌంటీలు చేస్తుండగా అతనికి పెద్ద బౌంటీ వస్తుంది. ప్రపంచంలో ప్రెగ్నెన్సీకి పనికొచ్చిన మహిళలను కాంప్లెక్స్‌లోకి తీసుకొచ్చి వాళ్ల మీద ప్రయోగాలు చేస్తుంటారు. అక్కడి నుంచి సుమతి(దీపికా పదుకొనే) తప్పించుకుంటుంది. అయితే ఆమె కడుపులో కల్కి పుడతాడని సుప్రీమ్ యాస్కిన్‌కి తెలుస్తుంది. దీంతో ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. సుమతిని పట్టుకున్న వాళ్ళకి ఫైవ్ మిలియన్ యూనిట్స్ ఇస్తారని తెలియడంతో భైరవ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ద్వాపరయుగం నుంచి మరణం లేకుండా బ్రతుకుతున్న అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) సుమతిని కాపాడుతుంటాడు. అసలు మరణమే లేని అశ్వత్థామ శాపంతో వేల సంవత్సరాలు నిద్రలో ఎందుకు ఉండిపోయాడు? సుమతిని ఎందుకు కాపాడాలని ప్రయత్నిస్తాడు? ఆమె కోసం శంబాలా ఎందుకు ఎదురు చూస్తోంది? ఆమెను భైరవ పట్టుకున్నాడా? లేదా? సుమతికి కల్కి పుడతాడని సుప్రీమ్ యాస్కిన్‌కి ఎలా తెలుస్తుంది? అనే విషయాలు తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
కల్కి సినిమా గురించి అందరూ ఎంతగానో ఎదురుచూశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహాభారతానికి, కలియుగానికి లింక్ ఉంటుంది. మొదటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. వాటికి మించి సినిమా ఉంది. మహాభారత ఎపిసోడ్‌తో చిత్రం ప్రారంభమవుతుంది. అశ్వత్థామకు, శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంభాషణతో ఆసక్తిగా సినిమా ప్రారంభమవుతుంది. అయితే కలియుగాంతంలో ప్రపంచం ఎలా ఉంటుంది? భూమి మీద వనరులు నాశనం అయ్యాక మనుషులు ఎలా జీవిస్తారు? అనేవి ఫస్టాఫ్‌లో చూపించారు. ఫస్టాఫ్ కొంచెం సాగదీతగా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ నుంచి సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. యాక్షన్ సీన్స్, విజువల్స్ అదిరిపోతాయి. సినిమా చూసినంత సేపు హాలీవుడ్ సినిమాలా అనిపిస్తుంది. ప్రభాష్ మధ్యలో కొంచెం కామెడీగా కనిపిస్తారు. సినిమా అంతా ఒకటి అయితే.. క్లైమాక్స్ ఇంకో రేంజ్. ఎవరూ ఊహించనంత విధంగా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే?
నటీనటలు విషయానికొస్తే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అదరగొట్టారు. కమల్ హాసన్ కెరీర్లో ఇదొక కీలకమైన పాత్ర అని చెప్పుకోవచ్చు. భైరవ్ పాత్రలో ప్రభాస్ కామెడీగా నటిస్తూనే యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టాడు. ఎవరూ ఊహించని విధంగా మరో పాత్రలో కనిపించాడు. దీపికా పదుకొనే ఎమోషనల్ క్యారెక్టర్లో నటించింది. మరియమ్మ పాత్రలో శోభన కూడా ఎమోషనల్‌గా నటించారు. ఇంకా దుల్కార్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ఆర్జీవీ, అనుదీప్, బ్రహ్మనందం, మృణాల్ ఠాకూర్, రాజేంద్రప్రసాద్, దిశా పటానీ తదితరులు వాళ్ల పాత్రలకు తగ్గట్టు మెప్పించారు.
సాంకేతిక అంశాలు
టెక్నికల్‌గా సినిమా ఓ రేంజ్లో ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. హాలీవుడ్ రేంజ్లో విజువల్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా 2898 సంవత్సరానికి తగ్గట్టు ఉంది. సినిమా కథ చాలా కొత్తగా ఉంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కథను పర్ఫెక్ట్గా తెరపై చూపించడంలో సఫలమయ్యారని చెప్పుకోవచ్చు. పాటలు బాగున్నాయి.. కానీ అంతగా ఆకట్టుకునేలా లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది.