టర్కీ, సిరియా దేశాలను భూకంపం వణికిస్తోంది. ఈ రెండు దేశాల్లో ఫిబ్రవరి 6, 7వ తేదీల్లో వచ్చిన భూకంపాలతో 5000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రకృతి సృష్టించిన ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ భూకంపం నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశమున్నట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. టర్కీలో 4వేల మందికి పైగా, సిరియాలో 1500 మంది వరకు మృత్యువాత పడినట్లుగా చెబుతున్నారు. పాతికవేలమంది వరకు గాయపడ్డారు. ఆగ్నేయ టర్కీ, ఉత్తర సిరియాలలో సోమవారం తెల్లవారు జామున 7.8 తీవ్రతతో శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం తర్వాత 200 సార్లు భూమి కంపించింది. దీంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. సిరియాలో జైలు ధ్వంసమై ఉగ్రవాదులు పారిపోయారు. భూకంపం కారణంగా హృదయ విదారక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇదే సమయంలో ఓ కుక్క తన యజమాని కోసం అరుస్తున్నట్లుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గోడల కింద యజమాని ఉండగా, పక్కనే ఉన్న కుక్క యజమాని కోసం ఆరుస్తోందని ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాలలో షేర్లు అవుతున్నాయి. ఇది అందరినీ కదిలిస్తోంది. అయితే ఈ ఫోటో మాత్రం ఇప్పటికి కాదని తెలుస్తోంది. ఇది కూడా భూకంపానికి సంబంధించిన ఫోటోనే కానీ, 2018 ఏడాదికి సంబంధించినదిగా ఫ్యాక్ట్ చెక్‌లో వెల్లడైంది. అయిదేళ్ల క్రితం ఏ ప్రాంతంలో వచ్చిన భూకంపానికి సంబంధించిన ఫోటో కూడా తెలియరాలేదు. 2018 నాటి ఫోటో.. నేటి టర్కీ భూకంపంకు సంబంధించినదిగా భావిస్తూ… శాడెస్ట్ పిక్చర్ ఆన్ ఇంటర్నెట్ టుడే అంటూ చక్కర్లు కొడుతోంది. కానీ ఇది 2018కి సంబంధించినది.