తనకు ప్రాణాంతక వ్యాధి సోకిందనే తెలుసుకున్న విదేశాల్లో ఉంటున్న ఓ యువకుడు ఏమాత్రం కుంగిపోకుండా.. తాను చనిపోతానని తెలిసినా తన వారిని ధైర్యంగా ఓదార్చాడు. తన మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కూడా తానే ఏర్పాట్లు చేసుకున్నాడు. వినడానికే కన్నీళ్లు తెప్పించే ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఖమ్మం నగరంలోని (khammam) శ్రీనివాస నగర్ కు చెందిన రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు తనయులు. తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారి (real estate) కాగా, తల్లి ప్రమీళ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ (government school principal). పెద్ద కొడుకు హర్షవర్ధన్ వయస్సు 33. రెండో కొడుకు అఖిల్. హర్షవర్ధన్ బీ-ఫార్మసీ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం పదేళ్ళ క్రితం 2013లో ఆస్ట్రేలియా (australia) వెళ్లాడు. బ్రిస్బేన్ లోని యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్ మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేశాడు. క్వీన్ ల్యాండ్స్ నగరంలోని ఓ ప్రయివేటు హాస్పిటల్ లో డాక్టర్ గా పని చేస్తున్నాడు. 2020 ఫిబ్రవరి 20వ తేదీన ఖమ్మంలో పెళ్లి చేసుకున్నాడు. వీసా వచ్చాక భార్యను తీసుకు వెళ్తానని చెప్పి, అదే నెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు. అయితే అప్పుడే అక్టోబర్ నెలలో వ్యాయమం చేస్తుండగా దగ్గుతో పాటు ఆయాసం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిందని డాక్టర్లు చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇంటికి రమ్మని తల్లిదండ్రులు (parents) చెప్పగా, ఆస్ట్రేలియాలో చికిత్స (treatment in australia) చేయించుకుంటానని, కంగారు పడవద్దని వారికి చెప్పాడు.
ఈ క్యాన్సర్ నయమయ్యే పరిస్థితి లేదు. తనకు చావు తప్పదని తెలిసి, భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమె తన జీవితంలో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు. 2022 సెప్టెంబర్ లో ఖమ్మం వచ్చి 15 రోజులు ఉండి వెళ్లాడు. ఆ మధ్య తగ్గినట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత తిరగబెట్టింది. అయినా హర్షవర్ధన్ భయపడలేదు. తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు, తాను మరణించాక మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ దేశ చట్టాలకు అనుగుణంగా అనుమతుల కోసం లాయర్ ను పెట్టుకున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో చివరి రోజుల్లో ఎక్కువగా తల్లిదండ్రులు, బంధువులతో వీడియో కాల్ చేసి మాట్లాడాడు. స్నేహితులను పిలిపించుకున్నాడు. చివరకు మార్చి 24న కన్నుమూశాడు. హర్షవర్ధన్ మృతదేహం బుధవారం ఖమ్మంలోని ఇంటికి వచ్చింది. అంత్యక్రియలు నిర్వహించారు.