ప్రధాని నరేంద్ర మోడీ (pm modi) ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తానని చెప్పి తొమ్మిదేళ్లు గడిచిందని, కానీ అది అబద్దపు హామీగా ఉండిపోయిందని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ అన్నారు (congress party leader rahul gandhi). ఆయన కర్నాటకలోని బీదర్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు (karnataka elections rally). మే రెండో వారంలో కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య టగ్ ఆఫ్ వార్ కనిపిస్తోంది. ఇక్కడ దశాబ్దాలుగా ఏ పార్టీ రెండోసారి అధికారంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ (congress) గెలుస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు. బీజేపీ గెలిస్తే మాత్రం రికార్డ్ అవుతుందని చెబుతున్నారు. కీలక ఎన్నికల నేపథ్యంలో రాహుల్ బీదర్ ర్యాలీలో మాట్లాడారు. దేశవ్యాప్తంగా బీజేపీ అబద్దపు హామీలు ఇస్తోందన్నారు. విద్వేషాన్ని నింపుతోందని మండిపడ్డారు. అదానీతో ప్రధాని మోడీకి ఉన్న ఆర్థిక సంబంధాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాను ఇదే అడిగినందుకు సభలో తన మైక్రోఫోన్ ను స్విచ్చాఫ్ చేశారని, ఆ తర్వాత అనర్హత వేటు పడిందన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యం పైన దాడి చేస్తోందని మండిపడ్డారు. అందరి భాగస్వామ్యం, అందరికీ స్థానం, అందరూ కలిసి ముందుకు సాగాలన్న బసవన్న గారి ఆలోచన ప్రకారం నడుచుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ 150 సీట్లు గెలుచుకోవడం ఖాయమని రాహుల్ అన్నారు.
అంతకుముందు రాహుల్ గాంధీ కర్నాటకకు చెందిన నందిని పాల పైన ట్వీట్ చేశారు. కర్నాటక ప్రైడ్.. నందిని బెస్ట్ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్పందించారు. రాహుల్ గాంధీ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. నందిని పాలు ఉత్తమమని భావించినందుకు సంతోషిస్తున్నాం.. నందిని ఉత్తమం అనే అంశంలో ఎలాంటి సందేహం లేదు. అయితే నందిని అమ్మకం కేరళలో సాఫిగా సాగడానికి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేరళలో నందిని ప్రవేశం కోసం ప్రచారం చేయాలని లేదంటే ఇప్పుడు మాట్లాడిన మాటలు రాజకీయ ప్రయోజనం కోసమే అవుతాయని చెప్పారు. కేరళలో మీ బహిరంగ ప్రకటన కోసం వేచి చూస్తున్నానని చెప్పారు.