వైఎస్ ఫ్యామిలీని సగ్గారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా జగ్గారెడ్డి, షర్మిల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిపై ఇటీవల షర్మిల విమర్శల వర్షం కురిపించారు. టీఆర్ఎస్ కి కోవర్టులా జగ్గారెడ్డి పని చేస్తున్నాడని ఆమె ఆరోపించారు. కాగా… ఈ మాటలు తనను విపరీతంగా బాధించాయని జగ్గారెడ్డి పేర్కొన్నారు.
షర్మిల ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసినా తెలంగాణ నాయకురాలు కాలేదన్నారు. వైఎస్ఆర్ ఫ్యామిలీలో జరుగుతున్న పంచాయతీని తీసుకొచ్చి రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. అన్నతో విబేధించి బయటకు వచ్చిన షర్మిల ఏపీలో పాదయాత్ర చేయాలి గానీ.. తెలంగాణలో ఏం పని అని జగ్గారెడ్డి నిలదీశారు.
‘విజయమ్మకు నేనొక సలహా ఇస్తున్నా.. మీ కొడుకు జగన్‌కు నచ్చజెప్పి షర్మిలను ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని చేయండి. తెలుగు రాష్ట్రాలకు మీ ఫ్యామిలీ వాళ్లే సీఎంలుగా ఉండాలా?.. ఒక్క రాష్ట్రానికి మూడు రాజధానులు పెట్టే బదులు.. ఏపీని మూడు రాష్ట్రాలుగా చేసి మీ కుటుంబం నుంచి ముగ్గురూ ముఖ్యమంత్రులు అయిపోండి. విశాఖ, అమరావతి, కడపను మూడు రాష్ట్రాలుగా చేసుకుని మీ ఫ్యామిలీ వాళ్లే పరిపాలించుకోండి. నిన్నగాక మొన్న పార్టీ పెట్టిన షర్మిల వెంటనే ముఖ్యమంత్రి అయిపోవాలని కలలుగంటోంది. నాకు టీఆర్ఎస్ నేతల అపాయింట్మెంటే దొరకదు.. అలాంటిది నన్ను టీఆర్ఎస్ కోవర్టు అని అంటారా?’ అని జగ్గారెడ్డి మండిపడ్డారు.