»It Is Clear Pm Modi Protecting Adani Rahul Gandhi
Rahul Gandhi: నా ప్రశ్నలకు మోడీ జవాబివ్వలేదు
గౌతమ్ అదానీతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నిసార్లు కలిసి ప్రయాణించారు? అతనిని మీరు ఎన్నిసార్లు కలిశారని తాను ప్రశ్నలు అడిగానని, కానీ లోకసభలో అంతసేపు మాట్లాడిన ప్రధాని తన ప్రశ్నలకు జవాబులు మాత్రం ఇవ్వలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) తన స్నేహితుడు అదానీని కాపాడుతున్నాడని స్పష్టంగా వెల్లడైందని కాంగ్రెస్ పార్టీ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు రాహుల్. నా ప్రశ్నలకు సమాధానం ఎక్కడా రాలేదని విమర్శించారు. అదానీ (Adani Group) పైన తాను లేవనెత్తిన వ్యవహారం, ప్రశ్నలపై సమాధానం ఎందుకు చెప్పలేదని నిలదీశారు. గౌతమ్ అదానీ (Gautam Adani) మీతో (Narendra Modi) ఎన్నిసార్లు కలిసి ప్రయాణించారు? అతనిని మీరు ఎన్నిసార్లు కలిశారని మాత్రమే అడిగాను. ఇవి చాలా చిన్న ప్రశ్నలు అని, కానీ తన ప్రశ్నకు ఆయన వద్ద సమాధానం లేదన్నారు. అలాగే, అదానీ గ్రూప్ వ్యవహారంపై దర్యాఫ్తు చేయిస్తానని కూడా చెప్పలేదన్నారు. ఆయనను రక్షిస్తున్నారని చెప్పడానికి ఇది చాలన్నారు. స్నేహితుడు కాకపోతే దర్యాఫ్తు జరపాలన్నారు. ఈ అంశం జాతీయ భద్రతకు సంబంధించినది కాబట్టి, ప్రధాని విచారణ జరిపించాల్సిందే అన్నారు. విచారణ గురించి ఏమీ మాట్లాడలేదని, కాబట్టి ఆయన ప్రసంగం పట్ల సంతృప్తిగా లేనని చెప్పారు.
షెల్ కంపెనీలు, బినామీ మనీ సర్క్యులేట్ అవుతోందని, దీని గురించి ఏమీ మాట్లాడలేదన్నారు. ఇది చాలా పెద్ద కుంభకోణమని, అలాంటి స్కామ్ పైన కూడా మాట్లాడకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అందుకే అదానీని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తాను అర్థం చేసుకోగలనని వ్యాఖ్యానించారు. తనను భారత ప్రజలు నమ్ముతున్నారని మోడీ చెబుతున్నారు కదా అని విలేకరులు ప్రశ్నించగా… అది ఓకే, కానీ అదానీ గురించి మాట్లాడాలన్నారు.
అంతకుముందు ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే ప్రసంగంలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని, అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారని పరోక్షంగా రాహుల్ గాంధీపై సెటైర్ వేశారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని, నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయట పెట్టాయన్నారు. గతంలో తన సమస్యల పరిష్కారం కోసం భారత్ ఇతరులపైన ఆధారపడేదని, ఇప్పుడు మన దేశం ఇతర దేశాల సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. నేడు భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని చెప్పారు. ఇది కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కానీ తనకు అయితే గర్వంగా ఉందని చెప్పారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మోడీ అన్నారు. కొందరు నిరాశలో మునిగిపోయి దేశ విజయాలను సహించలేకపోతున్నారన్నారు. నేడు అనేక దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయని, భారత్ మాత్రం అయిదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలబడిందని తెలిపారు. భారత్లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోవడం లేదన్నారు.