రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదేళ్లు దాటినా ఇంకా విభజనకు సంబంధించిన అంశాలు పరిష్కారం కాలేదు. సంస్థలు, నిధులు, ఉద్యోగుల విషయమై రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు రావాల్సిన బకాయిలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఏపీకి బదలాయించిన నిధులు తెలంగాణకు చెల్లించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.
విభజన మొదటి ఏడాది (2014-15)లో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఏపీ, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారని గుర్తుచేశారు. అయితే పొరపాటున సీఎస్ఎస్ నిధులను మొత్తం ఏపీకి బదలాయించారని తెలిపారు. దీంతో తెలంగాణ రూ.495 కోట్లు నష్టపోయిందని లేఖలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని కేంద్రాన్ని, ఏపీ ప్రభుత్వాన్ని, అకౌంటెంట్ జనరల్ కు గుర్తు చేశామని మంత్రి లేఖలో తెలిపారు. ఎనిమిదేళ్లు గడుస్తున్నా రూ.495 కోట్లు సర్దుబాటు చేయలేదని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని ఆ నిధులను తిరిగి తెలంగాణకు చెల్లించేలా చేయాలని లేఖలో నిర్మల సీతారామన్ ను మంత్రి హరీశ్ రావు కోరారు.