జమ్మూకశ్మీర్ రాజౌరీ జిల్లాలో శుక్రవారం ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించగా, మరో నలుగురు గాయపడ్డారు. గత మూడు రోజుల్లో ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడోసారి.
రాజౌరీ సెక్టార్‌లోని కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదుల ఉనికి గురించి వచ్చిన సమాచారంతో శుక్రవారం అక్కడి ఆర్మీ అధికారులు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. ఆ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్లపై బాంబులు వేయగా.. ఇద్దరు ఆర్మీ జవాన్లు మరణించారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు సమీప ప్రాంతాల నుంచి అదనపు బృందాలను ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి పంపించారు. గాయపడిన సిబ్బందిని ఉదంపూర్‌లోని కమాండ్ ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. మరోవైపు ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల బృందం చిక్కుకుపోయిందని.. ఉగ్రవాదుల గ్రూపులో ప్రాణనష్టం పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.