నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో స్పష్టత లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. ఏ విషయంలో క్లారిటీ లేకుండా పాదయాత్ర చేస్తున్న వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గడపగడపకు కార్యక్రమంలో మంత్రి రజని పాల్గొన్నారు. పాదయాత్ర ఎందుకో.. ఆ యాత్ర లక్ష్యం ఏమిటో ఆయనకే తెలియనట్టు ఉందని ఎద్దేవా చేశారు.
సీఎం వైఎస్ జగన్ హయాంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆమె తెలిపారు. పాదయాత్రలో అమ్మ ఒడి పథకం అవసరం లేదని చెప్పగలరా? రైతు భరోసా పథకం, వైఎస్పార్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, ఆరోగ్యశ్రీ పథకాలు రాష్ట్ర ప్రజలకు వద్దని చెప్పే ధైర్యం ఉందా? నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు, ఆస్పత్రులను అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని చెబుతావా? కనీసం సీఎం అభ్యర్థి ఎవరో చెప్పగలవా? తానే సీఎం అని చెప్పగలిగే ధైర్యం ఉందా అని అడిగారు.
పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థి అని చెప్పగలడా? లేదా చంద్రబాబునాయుడు సీఎం అభ్యర్థని చెప్పగలడా? తెలుగుదేశం పార్టీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తామని చెప్పగలరా అని అడిగారు. ఏ విషయంలో క్లారిటీ లేకుండా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని మంత్రి రజనీ మండిపడ్డారు. ఆ పాదయాత్ర పేరు యువగళం కాదు.. గందరగోళం అని ఎద్దేవా చేశారు. లోకేశ్ పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. యాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో తొలుత కుప్పం.. ఆ తర్వాత బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.