తన ప్రతిష్ఠను దిగజార్చేలా యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఏపీసీసీ వైఎస్ షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సహచరులపై కూడా అసభ్య కామెంట్లు పెడుతున్నారని వారి పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు.
Sharmila approached the police saying she was being trolled on social media
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) సైబర్ క్రైమ్స్‌కు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడం, తన ప్రతిష్టను దెబ్బతీయడమే పనిగా పెట్టుకున్నారని వారి పేర్లను కూడా షర్మిల ప్రస్తావించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అయిన తరువాత ప్రజలను కలవడం కొందరికి నచ్చక, తనపై కక్ష్య సాధింపు చర్యలకు పాలు పడుతున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక తనపై, తన అనుచరులపై ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారని, వైఎస్ షర్మిల ప్రాణాలకు ప్రమాదం, దొంగల ముఠా, వైఎస్ షర్మిల క్యాంపు కార్యాలయంలో కోవర్టు ఆపరేషన్ లాంటి పేర్లతో ఫేక్ పీడీఎఫ్ కాపీలను సర్క్యూలేట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు చేతులో కీలుబొమ్మ అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మేదరమెట్ల కిరణ్‌కుమార్, రమేశ్ బులగాకుల, పంచ్ ప్రభాకర్ (అమెరికా), ఆదిత్య (ఆస్ట్రేలియా), సత్యకుమార్ దాసరి (చెన్న), సేనాని, వర్రా రవీందర్‌రెడ్డి, శ్రీరెడ్డి, మహ్మద్ రెహ్మత్ పాషా వంటి వారిపై చర్యలు తీసుకోవాలని, వీరిని ఇలానే ఉపేక్షిస్తే తనకు తీరని నష్టం కలుగుతుందని షర్మిల తన ఫిర్యాదులో పేర్కొన్నారు.