Former cricketer Ambati Rayudu responded to Pawan's comments on volunteers
Ambati Rayudu: ఏలూరు సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గ్రామ వాలంటీర్ల(volunteers) గురించి మాట్లాడిన మాటలకు ఏపీ అధికార పక్షం భగ్గుమంటోంది. మిస్సైన మహిళలకు సంబంధించిన పూర్తి డేటాతో వివరణ ఇవ్వల్సిందిగా పవన్‌కు రాష్ట్ర మహిళ కమిషన్ నోటిసులు జారీ చేసింది. పలు చోట్ల వాలంటీర్లు పవన్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ స్థానిక పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు(Ambati Rayudu) స్పందించారు.
పవన్ చేసిన వ్యాఖ్యలు నిరాధారం అని.. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని అంబటి రాయుడు అన్నారు. మంచి పనులు చేసే సమయంలో ఎవరో ఒకరు బురద చల్లడం మాములు విషయమే అని, ప్రభుత్వం మంచి పనులను చూసి తట్టుకోలేని వారే ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతారని తెలిపారు. సీఎం జగన్ ఏమి చేసిన ప్రజా శ్రేయస్సు కోసమే చేస్తాడని.. అందులో భాగంగా వాలంటీర్ల వ్యవస్థ చాలా గొప్ప ఆలోచన అని, ప్రతి మనిషికి ఏ సేవలు అవసరమో అవన్నీ వాలంటీర్ల ద్వారా పక్కాగా అందుతున్నాయని వివరించారు.
కరోనా వేళ ప్రాణాలకు తెగించి వాలంటీర్లు అందించిన సేవలను గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా ఇలాంటి వాలంటీర్ వ్యవస్థ లేదని, ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వాలంటరీ వ్యవస్థ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అంబటి రాయుడు అన్నారు. ఇక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రాయుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన సీఎం జగన్‌తో సమావేశం అయ్యారు. రాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.