ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) చివరి ముఖ్యమంత్రి (chief minister) కిరణ్ కుమార్ రెడ్డి (kiran kumar reddy) ఈ రోజు (శుక్రవారం, ఏప్రిల్ 7) బీజేపీలో (bjp) చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తదితర నేతల సమక్షంలో నేడు మధ్యాహ్నం కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. గతంలోను త్వరలో.. రేపో మాపో చేరుతారని వార్తలు వచ్చాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ (united andhra pradesh) ఉన్న సమయంలో రోశయ్య తర్వాత 2010 నవంబర్ 25వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మార్చి 1వ తేదీ 2014 వరకు ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత విభజన జరగడం, ఆయన కాంగ్రెస్ ను (congress) వీడి.. జై సమైక్యాంధ్ర (Jai Samaikyandhra Party) పేరుతో కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసిందే. 12 మార్చి 2014న జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించిన కిరణ్ రెడ్డి 2018 జూలై 13న తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ముఖ్యమంత్రి కంటే ముందు ఆయన స్పీకర్ గా పని చేశారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో తన తండ్రి మృతి అనంతరం జరిగిన ఎన్నికల ద్వారా రాజకీయ ఆరంగేట్రం చేశారు. 1989, 1999, 2004లో గెలిచారు. 1995లో మాత్రం ఓడిపోయారు. 2009లో పీలేరు నుండి విజయం సాధించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2004 నుండి 2009 వరకు చీఫ్ విప్ గా ఉన్నారు.
2018లో నాటి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ఆయన క్రియాశీలకంగా కనిపించలేదు. ఎప్పటికప్పుడు బీజేపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మొత్తానికి నేడు బీజేపీలో చేరేందుకు ఆయన అంతా రంగం సిద్ధం చేసుకున్నారు. బీజేపీలో చేరేందుకు ఆయన అధిష్టానం ముందు హామీలు పెట్టడమే ఇప్పటి వరకు ఆలస్యానికి కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. పార్టీలో తన బాధ్యతల పైన ఢిల్లీ పెద్దల నుండి హామీ వచ్చాక పార్టీలో చేరేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం ఆయన గట్టిగా కృషి చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ విభజన నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడి, జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి హైదరాబాద్ లోను తమ అభ్యర్థులను బరిలోకి దింపారు. అలాంటి సమైక్యవాది తమ పార్టీకి ఉంటే ప్లస్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. అందుకే బీజేపీ కూడా ఆయనను చేర్చుకునేందుకు మొగ్గు చూపింది.