ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సాధారణంగా మార్చిలో బడ్జెట్ సమావేశాలను ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిర్వహించాలని, అది కూడా 20 రోజుల పాటు సెషన్స్ నిర్వహించాలని జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, ఆ తర్వాత 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు జరగబోతోంది. వీటిని దృష్టిలో ఉంచుకునే.. 2023-24 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ముందుగా నిర్వహించేందుకు జగన్ సర్కార్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బడ్జెట్ రూపకల్పనపై ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది బడ్జెట్ అవసరాలను అంచనా వేయాల్సిందిగా పలు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులను ఆర్థిక శాఖ సూచించింది.
గతేడాది తరహాలోనే సంక్షేమానికి పెద్ద పీట వేయాలని ప్రభుత్వం స్పష్టంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో ఏ మాత్రం లోటు ఉండకూడదని, అభివృద్ధి విషయంలోనూ కీలక అంశాలపై ఫోకస్ చేయాలని అధికారులకు సూచించింది. అలాగే ఈ కేటాయింపులకు అవసరమైన నిధులను సమకూర్చుకునేందుకు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ, మైనింగ్, రెవెన్యూ వంటి వాటి నుంచి మరింత ఆదాయాన్ని సమకూర్చుకునే దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. దానికి తోడు విద్య, వైద్యం వంటి రంగాలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నందున ఈ రంగాలకు సంబంధించి కేంద్రం నుంచి ఎంతమేరకు నిధులను రాబట్టగలమనే అంచనాలను కూడా సిద్దం చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు సమాచారం.