»Alert To Srivari Devotees Darshan Of Vaikuntam For Ten Days
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని భక్తులు దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పది రోజుల పాటు అంటే డిసెంబర్ 23వ తేది నుంచి జనవరి 1వ తేది వరకూ వైకుంఠ దర్శనం ఉంటుందని వెల్లడించింది.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanams) శుభవార్త చెప్పింది. భక్తులకు శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 23వ తేది నుంచి జనవరి ఒకటో తేది వరకూ వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంటామని, ఆ రోజుల్లో భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
వైకుంఠంలో శ్రీమహావిష్ణువు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 40 నిమిషాల పాటు దేవతలకు, భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజూ అది వైకుంఠంలో జరిగే ప్రక్రియ. భూలోకంలో కూడా ఆ కాలమానం ప్రకారంగా వైష్ణవాలయాల్లో పది రోజుల్లో వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది. ఆ రోజుల్లో స్వామిని దర్శనం చేసుకుంటే శ్రీమహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకున్న భాగ్యం కలుగుతుందని భక్తులకు విశ్వాసం ఉంది.
వైకుంఠ ద్వార దర్శనం ఉండే పది రోజుల్లో ఏ రోజైనా దర్శనం చేసుకుంటే మంచిదని టీటీడీ తెలిపింది. భక్తులు ఆ విషయాన్ని గమనించి దర్శనాలకు రావాలని కోరింది. తిరుమలలో గదులు పరిమితంగానే ఉన్నందువల్ల భక్తులు తిరుపతిలో గదులను తీసుకోవాలని కోరింది. ప్రోటోకాల్ వీఐపీలకు పరిమితంగానే బ్రేక్ దర్శనం ఉంటుందని తెలిపింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.