గుంటూరు టీడీపీ సభ ప్రమాదంపై వైసీపీ వసంత కృష్ణ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు చంద్రబాబు కందుకూరు సభలో ప్రమాదం కారణంగా ఎనిమిది మంది మృత్యువాత పడగా, ఆ తర్వాత నాలుగు రోజుల వ్యవధిలోనే గుంటూరు సభలో ముగ్గురు మృతి చెందారు. కందుకూరు సభలో ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ వేలాది మందికి చంద్రన్న కానుకలు ఇస్తామని ప్రకటించారు. దీంతో పెద్ద ఎత్తున జనాలు తరలి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనపై వైసీపీ నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని, కొడాలి నాని, రోజా తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రచార యావ కారణంగా సామాన్యులు బలి అవుతున్నారని మండిపడ్డారు. గుంటూరు సభకు కారణమైన ఎన్నారై ఉయ్యూరుపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వసంత కృష్ణప్రసాద్ మాత్రం భిన్నంగా స్పందించారు.
గుంటూరులో జరిగిన ప్రమాదం దురదృష్టవశాత్తు జరిగిందని, దానిని చిలవలు, పలవలు చేసి మాట్లాడటం సరికాదన్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ చాలా మంచి వారు అని, తనకు చాలా రోజులుగా స్నేహితుడు అన్నారు. ఎన్నారైలు భారత్లో, తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని, అలాంటి వారిని భయపెడితే ఎలా అని ప్రశ్నించారు. గతంలోను ప్రతి రాజకీయ పార్టీ దుస్తులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయని, కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున చేయబోయి ఇలా జరిగిందని, కానీ వారి ఉద్దేశ్యాలు ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఉండదు కదా అని ప్రశ్నించారు. ఉయ్యూరు శ్రీనివాస్ ఎంతోమంది పేదలకు సాయం చేశారన్నారు.
ఈ రోజు రాజకీయంగా ఓ వేదిక మీదకు వచ్చాడు కాబట్టి అతని పైన విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. ఈ ప్రమాదాన్ని అదునుగా తీసుకొని, కొంతమంది ఎన్నారైలు మూసుకొని ఉండాలంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, రాజకీయ కార్యక్రమాల్లో ఎవరి అభిరుచికి తగినట్లు వారు ఉండటంలో తప్పు లేదన్నారు. కానీ ఎన్నారైల తోడ్పాటు కారణంగా ఈ దేశానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఇందుకు గుజరాత్, కేరళ, ఉభయ తెలుగు రాష్ట్రాలు నిదర్శనం అన్నారు. కొంతమంది క్రీడలు, మరొకరు రాజకీయం ఇలా ఏదో రంగాన్ని ఎంచుకుంటున్నారన్నారు. అంతమాత్రాన ఎన్నారైలను తప్పుబట్టడం సరికాదన్నారు. కొంతమంది ప్రవాస భారతీయులు దశాబ్దాలుగా సహాయం చేస్తున్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని, కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.